Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు గుడ్‌న్యూస్.. జీతాల పెంపుపై మంత్రి సీతక్క కీలక ప్రకటన

అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు గుడ్‌న్యూస్.. జీతాల పెంపుపై మంత్రి సీతక్క కీలక ప్రకటన

Telugu Samayam 1 week ago

తెలంగాణలోని అంగన్‌వాడీ సిబ్బందికి ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు అందించబోతోంది. సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల జీతాల పెంపుదల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని, దీనిపై అతి త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

ప్రభుత్వ అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మమాట-అంగన్‌వాడీ బాట నూతన విద్యాసంవత్సరం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఆమె ఈ కీలక ప్రకటన చేశారు.

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మంత్రి సీతక్క సోమవారం రెబ్బెన మండలం గోలేటి గ్రామపంచాయతీ పరిధిలోని రేకులగూడ అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు ప్రభుత్వం తరఫున ఉచితంగా అందజేసే యూనిఫారాలను మంత్రులు చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం.. కొత్తగా అంగన్‌వాడీలో చేరుతున్న పలువురు చిన్న పిల్లలకు సాంప్రదాయబద్ధంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించి వారితో పలకలపై అక్షరాలు రాయించారు. కేంద్రంలోని వసతులు, పిల్లలకు అందుతున్న పౌష్టికాహారం వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఒక క్రమబద్ధమైన ప్రణాళికతో ముందుకు వెళ్తోందని తెలిపారు. అందులో భాగంగా.. ఈ నెల 6న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లా నుంచి ముగ్గురు చొప్పున అంగన్‌వాడీ టీచర్లు, ప్రతినిధులను హైదరాబాద్‌కు పిలిపించి ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలు, వారి ఆలోచనలను నేరుగా సేకరించిన అనంతరం వేతనాల పెంపుదలకు సంబంధించిన నివేదికను ముఖ్యమంత్రి పరిశీలనకు పంపుతామని ఆ వెంటనే జీతాల పెంపుపై అధికారిక నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు.

దీంతో పాటు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ అంగన్‌వాడీ కేంద్రాలలో చాలా కాలంగా అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయని మంత్రి సీతక్క తెలిపారు. ఈ ఖాళీల కారణంగా కేంద్రాల నిర్వహణ నిలిచిపోకుండా ఉండేందుకు.. సదరు ఖాళీలను స్థానిక నిబంధనల ప్రకారం అత్యంత పారదర్శకంగా భర్తీ చేసేందుకు వీలుగా అన్ని జిల్లాల కలెక్టర్లకు తక్షణ ఆదేశాలు జారీ చేశామని స్పష్టం చేశారు. అంగన్‌వాడీల రూపురేఖలను మార్చడమే కాకుండా.. పేద పిల్లలకు నాణ్యమైన ప్రాథమిక విద్య, పౌష్టికాహారం అందించటమే ప్రజా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam