'బేబీ' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ - వైష్ణవి చైతన్య కాంబోలో వస్తోన్న సినిమా 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్'. '#90s: ఏ మిడిల్‌క్లాస్ బయోపిక్' ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పాటలు, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. చాలా రోజుల క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ఖరారు చేశారు.
'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్' సినిమాని సెప్టెంబర్ 11, 2026న వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ''మోస్ట్ బ్యూటిఫుల్ ప్రయాణాలు సింపుల్ మూమెంట్స్ తోనే మొదలవుతాయి'' అంటూ ఓ బ్రాండ్ న్యూ పోస్టర్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇందులో ఆనంద్ - వైష్ణవీ ఒకేరకమైన దుస్తులు ధరించి, ఒక డాగ్ తో కలిసి బీచ్ లో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇది ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది.
లండన్ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా 'ఎపిక్' రూపొందుతోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ & ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2026 సమ్మర్ లోనే రిలీజ్ చేయనున్నట్లు అప్పట్లో అనౌన్స్ చేశారు. కానీ సరైన స్లాట్ దొరక్కపోవడంతో, కాస్త వెయిట్ చేసి వినాయక చవితికి వస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. అజీమ్ మహ్మద్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. నవీన్ నూలి ఎడిటింగ్ చేశారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరించారు. 'బేబీ' హిట్ పెయిర్ కి ఈ ఎపిక్ ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

