Apple CEO Team Cook: యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్ ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన కార్పొరేట్ దిగ్గజాలలో ఒకరిగా వెలుగొందుతున్నారు. అయితే, ఒకానొక సమయంలో ఆయనకు యాపిల్ కంపెనీలో చేరాలనే ఆలోచన అసలు లేదనే విషయం చాలా మందికి తెలియదు.
1998వ సంవత్సరంలో కంపాక్ (Compaq) కంపెనీలో వైస్ ప్రెసిడెంట్‌గా స్థిరపడిన సమయంలో తీవ్ర నష్టాల్లో ఉన్న యాపిల్ నుంచి పిలుపు అందుకున్నారు. అందరూ వద్దన్నా వినకుండా స్టీవ్ జాబ్స్‌ను కలిసిన ఐదు నిమిషాల్లోనే తన కేరీర్ మలుపు తిప్పిన ఆ నిర్ణయాన్ని టిక్ కుక్ తీసుకున్నారు. 15 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం కంపెనీకి సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఆ బాధ్యతల నుంచి వైదొలుగుతున్న తరుణంలో ఆయన ప్రస్థానం ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1998లో టిమ్ కుక్ కాంపాక్ కంపెనీలో ఉన్నప్పుడు ఆ కంపెనీ విలువ 30 బిలియన్ డాలర్లు. అప్పుడు యాపిల్ కంపెనీ విలువ 3 బిలియన్ డాలర్లు మాత్రమే. దివాలా అంచున ఉన్న ఆ కంపెనీ నుంచి ఆఫర్ రావడంతో సాధారణంగా అదరిలానే కుక్ సైతం తిరస్కరించారు. కానీ, స్టీవ్ జాబ్స్‌తో భేటీ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. జాబ్స్ విజన్ ఆయనను అమితంగా ఆకట్టుకుంది. దీంతో కాంపాక్‌ను వీడి యాపిల్‌లో చేరారు. ఈ విషయాన్ని 2014లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఆయనే చెప్పారు.
3 దశాబ్దాలు, 15 ఏళ్లుగా సీఈఓ
యాపిల్ కంపెనీలో టిమ్ కుక్‌ది మూడు దశాబ్దాల ప్రస్థానం. 1998లో కంపెనీలో చేరిన ఆయన వివిధ హోదాల్లో పని చేశారు. 2011లో స్టీవ్ జాబ్స్ నుంచి నాయకత్వ బాధ్యతలు తీసుకున్నారు. 15 సంవత్సరాల పాటు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా కొనసాగారు. ఈ ప్రయాణంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. తన తర్వాత ఆ బాధ్యతల్లో సరైన వ్యక్తిని కూర్చోబెట్టాలనిచాలా కాలం అన్వేషించి జాన్ టెర్నస్‌ను ఎంపిక చేశారు. కొత్త సీఈఓకు బాధ్యతలు అప్పగించి ఇకపై కంపెనీకి ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగనున్నారు.కుక్ హయాంలోని కొన్ని మైలురాళ్లు
టిమ్ కుక్ నాయకత్వ బాధ్యతలు తీసుకునే నాటికి యాపిల్ సంస్థ విలువ 350 బిలియన్ డాలర్లు. ఇప్పుడు అది 4.5 ట్రిలియన్ డాలర్లు దాటింది. ఈ కాలంలో యాపిల్ షేర్లు 2,275 శాతం పెరిగాయి. యాపిల్ యాప్ స్టోర్, ఐక్లౌడ్, యాపిల్ మ్యూజిక్, యాపిల్ పే, యాపిల్ టీవీ ప్లస్ వంటి సేవలను కుక్ తీసుకొచ్చారు. 2015లో ఈసీజీ, ఫాల్ డిటెక్షన్ ఫీచర్లతో విడుదల చేసిన యాపిల్ వాచ్, 2016లో తెచ్చిన ఎయిర్ పాడ్స్ మార్కెట్లో సంచలనం సృష్టించాయి. ఇంటెల్ ప్రాసెసర్లపై ఆధారపడడాన్ని తగ్గించి సొంతంగా M-సిరీస్ చిప్ ల తయారీ చేపట్టారు. అయితే, ఆయన హయాంలోనూ కొన్ని వైఫల్యాలు ఉన్నాయి. భారీగా పెట్టుబడులు పెట్టిన ఎలక్ట్రిక్ కారు ప్రాజెక్ట్‌ను 2024లో ఆపేశారు. యాపిల్ నుంచి ఫోల్డబుల్ ఫోన్లు ఇప్పటి వరకు రాలేదు.
