Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్.. హైదరాబాద్ క్లైమెట్ హిస్టరీలోనే అత్యంత ఘోరమైన వేసవి

అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్.. హైదరాబాద్ క్లైమెట్ హిస్టరీలోనే అత్యంత ఘోరమైన వేసవి

Telugu Samayam 1 week ago

హైదరాబాద్ వాసులకు ఈ ఏడాది వేసవి కాలం ఒక సాధారణ సీజన్‌లా కాకుండా.. 'అగ్ని'పరీక్షలా సాగింది. పగటిపూట నిప్పులు చెరిగే ఎండలు, రాత్రి వేళల్లో ఉపశమనం లేని ఉక్కపోతతో నగరం అల్లాడిపోయింది.

అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావం హైదరాబాద్‌ను నిప్పుల కొలిమిలా మార్చేసింది. ఫలితంగా గత దశాబ్ద కాలంలోనే అత్యంత ఉష్ణోగ్రతలు కలిగిన వేసవిగా 2026 నమోదైంది. వాతావరణ గణాంకాలను పరిశీలిస్తే 2026 వేసవి ఎంత భయంకరంగా సాగిందో అర్థమవుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుండి జూన్ 1 మధ్య కాలంలో నగరంలో ఏకంగా 47 రోజుల పాటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదయ్యాయి. గతంలో అత్యంత భీకరమైన హీట్‌వేవ్ ఇయర్‌గా భావించిన 2015లో కేవలం 42 రోజులు మాత్రమే. ఈసారి ఆ రికార్డు బద్దలైంది. దీనికి భిన్నంగా 2021 వేసవిలో కేవలం 3 రోజులు మాత్రమే 40 డిగ్రీల సెల్సియస్ దాటింది.

2015లో ఎండలు కొన్ని రోజుల పాటు గరిష్ట స్థాయికి చేరి మళ్లీ తగ్గుముఖం పట్టాయి. కానీ 2026లో దాదాపు రెండు నెలల పాటు నిరంతరాయంగా ఉష్ణోగ్రతలు స్థిరంగా అధికంగా కొనసాగాయి. అంబర్‌పేట్, హిమాయత్‌నగర్, గచ్చిబౌలి నుంచి మేడిపల్లి వరకు నగరంలోని అన్ని శివారు, ప్రధాన ప్రాంతాలు వారాల తరబడి ఈ తీవ్రమైన ఉష్ణోగ్రతలకు గురయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలే కాకుండా.. రాత్రి వేళల్లో కూడా భూమి చల్లబడకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ విస్తరణే ఈ విపత్కర వాతావరణ మార్పుకు కారణమని నిపుణులు అంటున్నారు.

ఆకాశాన్ని తాకుతున్న ఎత్తైన బిల్డింగులు, విస్తరిస్తున్న తారు రోడ్లు, కాంక్రీట్ భవనాలు నగర సహజసిద్ధ కూలింగ్ వ్యవస్థను దెబ్బతీశాయని చెబుతున్నారు. వీటితో పాటు నగరవాసులు విరివిగా వాడుతున్న ఏసీలు లోపలి వేడిని బయటకు పంపిస్తూ.. బయట వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. వేసవి ఇంత తీవ్రంగా ఉండటం వెనుక నగరంలోని సరస్సులు, చెరువులు కుంచించుకుపోవడమే ప్రధాన కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అడ్డూఅదుపూ లేని పట్టణీకరణ ఇలాగే కొనసాగితే.. రాబోయే దశాబ్ద కాలంలో హైదరాబాద్‌లో సాధారణ వేసవి అనే పదానికి అర్థమే మారిపోతుందని క్లైమేట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే.. పట్టణ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు గణనీయంగా ఎక్కువగా నమోదయ్యే వాతావరణ పరిస్థితిని అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటారు. నగరాల్లోని కాంక్రీట్ కట్టడాలు, తారు రోడ్లు పగటిపూట వేడిని ఎక్కువగా పీల్చుకుని రాత్రి వేళల్లో ఆ ఉష్ణాన్ని వాతావరణంలోకి విడుదల చేస్తాయి. అలాగే పచ్చదనం, జలాశయాలు తగ్గటం వల్ల నగరాలు సహజంగా చల్లబడే గుణాన్ని కోల్పోతాయి. తద్వారా వేసవి తాపం ఎక్కువగా ఉంటుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam