ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భారీ సంఖ్యలో ఓటర్ల పేర్లు ASDD జాబితాలోకి వెళ్లడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన ఆయన.. అర్హత ఉన్న ఒక్క ఓటరు కూడా తుది జాబితాలో చోటు కోల్పోకుండా ప్రక్రియను పారదర్శకంగా, అందరికీ అవకాశం కల్పించేలా నిర్వహించాలని సూచించారు. SIRలో తెలంగాణకు చెందిన 73.39 లక్షల ఓటర్ల ఎంట్రీలు ASDD జాబితాలోకివెళ్లాయని సీఎం పేర్కొన్నారు. వీరిలో 45.19 లక్షల మందిని శాశ్వతంగా తరలిపోయినవారుగా గుర్తించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం ASDD ఎంట్రీల్లో దాదాపు 58.6 శాతం హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నాయని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా జారీ చేసిన వెరిఫికేషన్ నోటీసుల్లోనూ 41.9 శాతం ఈ మూడు జిల్లాల్లోనే ఉన్నాయని తెలిపారు.
తాత్కాలికంగా ఇంట్లో లేని ఓటర్లను శాశ్వతంగా తరలిపోయినవారిగా పరిగణించకూడదని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగం, విద్య, ఇతర కారణాలతో తాత్కాలికంగా మరో ప్రాంతంలో ఉన్నవారికి తగిన అవకాశం కల్పించాలని కోరారు. ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లిన వారికి కొత్త చిరునామాలో ఓటు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించాలని సూచించారు. షిఫ్టెడ్ కేటగిరీలో ఉన్న ఓటర్లకు కూడా తప్పనిసరిగా నోటీసులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 16 వరకు ఉన్న క్లెయిమ్స్, అభ్యంతరాల గడువును మరో నాలుగు వారాలు పొడిగించాలని సీఎం కోరారు. సెప్టెంబరు 19న తుది జాబితా ప్రచురణకు బదులుగా అదనపు సమయం ఇవ్వాలని ప్రతిపాదించారు. నోటీసులు అందుకున్న ఓటర్లకు స్పందించేందుకు కనీసం 3-4 వారాల వ్యవధి ఉండాలని పేర్కొన్నారు.
గ్రామసభలు, వార్డు సభల్లో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను బహిరంగంగా చదివించాలని, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని ఈసీకి సూచించారు. SIRలో అంగీకరించే పత్రాలపై తెలంగాణకు స్పష్టమైన, విస్తృత జాబితా ప్రకటించాలని కోరారు. మండల స్థాయిలో సులభంగా లభించే పత్రాలను కూడా అందులో చేర్చాలని సూచించారు. హైదరాబాద్‌లో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 78 వేల వరకు నోటీసు కేసులు ఉన్నాయని సీఎం వెల్లడించారు. ERO స్థాయిలో అదనపు అధికారులను నియమించి ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. అర్హత ఉన్న ఒక్క ఓటరు కూడా తుది జాబితా నుంచి తొలగిపోకుండా చూడటమే తమ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

