ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ పరుగులు వరద పారిస్తున్నాడు. ప్రతీ మ్యాచులోనూ పరుగులు చేస్తూ..
జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇటీవల ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచులోనూ అజేయ హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 9 మ్యాచులు ఆడిన క్లాసెన్.. సుమారు 60 సగటుతో 414 పరుగులు స్కోరు చేశాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో ప్లేసులో కొనసాగుతున్నాడు.
కాగా దక్షిణాఫ్రికాకు చెందిన హెన్రిచ్ క్లాసెన్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కేవలం ఫ్రాంఛైజీ క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు క్లాసెన్. బుధవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ 30 బంతుల్లోనే 65 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ బ్యాటర్ కెవిన్ పీటర్సన్.. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుకు ఓ విజ్ఞప్తి చేశాడు. క్లాసెన్‌ను తన అంతర్జాతీయ క్రికెట్ రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకునేలా ఒప్పించాలని కోరాడు.
"దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు ఇప్పటివరకు ఒక్క ప్రపంచ కప్‌ను కూడా గెలవలేదు. ఆ దేశ క్రికెట్ బోర్డు అధికారులు క్లాసెన్‌కు ఫోన్ చేసి మాట్లాడాలి. స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవడం కోసం తిరిగి అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని కోరాలి. క్లాసెన్ ఫామ్, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతడు చూపగల ప్రభావాన్ని బట్టి చూస్తే స్వదేశంలో జరిగే వరల్డ్ కప్‌లో ప్రొటీస్‌కు కీలక ఆటగాడు కాగలడు. క్లాసెన్ ప్రత్యేకమైనవాడు. అలాంటి వారు ఎక్కువమంది ఉండరు. క్లాసెన్ సౌతాఫ్రికా జట్టులో ఉంటే.. వారి విజయావకాశాలు గణనీయంగా మెరుగుపడతాయి" అని కెవిన్ పీటర్సన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు.
కాగా 2027లో వన్డే ప్రపంచకప్‌కు దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటివరకు సఫారీలు ఒక్కసారి కూడా ప్రపంచ కప్‌ను సాధించలేదు. కానీ వచ్చే ఏడాది స్వదేశంలో టోర్నీ జరగనుండటం వారికి కలిసొచ్చే అంశం. ఈ క్రమంలో సూపర్ ఫామ్‌లో ఉన్న క్లాసెన్ రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలని కేపీ సూచించాడు.
హెన్రిచ్ క్లాసెన్ 2018లో దక్షిణాఫ్రికా తరఫున అరంగేట్రం చేశాడు. దక్షిణాఫ్రికా తరఫున 60 వన్డేల్లో 2141 పరుగులు.. 58 టీ20ల్లో 1000 పరుగులు చేశాడు. తన కెరీర్‌లో కేవలం 4 టెస్టులు మాత్రమే ఆడాడు. మొత్తంగా తన అంతర్జాతీయ కెరీర్‌లో 4 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు సాధించాడు. 2025 జూన్ 2న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

