జపాన్ నిస్షిన్‌లోని కొరోగి స్పోర్ట్స్ పార్క్ వేదికగా జరిగిన ఏషియన్ గేమ్స్ 2026 మహిళల క్రికెట్ రెండో సెమీఫైనల్లో భారత జట్టు 114 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఘోరంగా ఓడించింది.
ఈ విజయంతో టీమిండియా మంగళవారం (సెప్టెంబర్ 22) జరగబోయే హై-వోల్టేజ్ గోల్డ్ మెడల్ ఫైనల్ మ్యాచ్‌కు చేరింది. ఆ మ్యాచులో శ్రీలంకతో తలపడేందుకు సిద్ధమైంది. హ్యాంగ్‌జౌ ఏషియన్ గేమ్స్ ఫైనల్ రీపీట్ కానున్న ఈ పోరుపై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన పవర్ ప్లేలోనే 72 పరుగులు చేసి శుభారంభం అందించారు. ఈ మ్యాచ్‌లోనే స్మృతి మంధాన (37) మహిళల టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా సూజీ బేట్స్ వరల్డ్ రికార్డును బద్దలు కొట్టింది. ఆ తర్వాత క్రీజులో పూనకం వచ్చినట్లు ఆడిన షెఫాలీ వర్మ కేవలం 49 బంతుల్లో 9 సిక్సర్లతో అంతర్జాతీయ టీ20ల్లో తన తొలి సెంచరీని (100 నాటౌట్) నమోదు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (40) సాయంతో భారత్ 20 ఓవర్లలో 195/4 పరుగుల స్కోరు చేసింది.
196 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు భారత బౌలర్లు ఏమాత్రం అవకాశమివ్వలేదు. పుట్టినరోజు జరుపుకుంటున్న నందని శర్మ తాను వేసిన తొలి బంతికే వికెట్ తీసి బోణీ కొట్టింది. అనంతరం కెప్టెన్ హర్మన్ స్పిన్నర్లను రంగంలోకి దించడంతో బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్ కకావికలమైంది. శ్రీ చరణి పటిష్టమైన పార్ట్‌నర్‌షిప్‌ను విడదీయగా, శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ, నందని శర్మ వరుస వికెట్లతో బంగ్లాదేశ్ పని పట్టారు.
తీవ్ర ఒత్తిడికి గురైన బంగ్లాదేశ్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో ఆ జట్టు కేవలం 15.4 ఓవర్లలో 81 పరుగులకే ఆలౌటైంది. దీప్తి శర్మ (3/7), నందని శర్మ (3/25), శ్రీ చరణి (2/7) అద్భుత బౌలింగ్ గణాంకాలు నమోదు చేశారు. ఈ విజయంతో రజత పతకాన్ని ఖాయం చేసుకున్న భారత్, సెప్టెంబర్ 22న జరిగే ఫైనల్లో శ్రీలంకను ఓడించి పసిడి పతకాన్ని గెలుచుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది.

