Dailyhunt
బాక్సాఫీస్ వద్ద చతికిలబడ్డ 'ఏక్ దిన్'... సాయి పల్లవికి బాలీవుడ్‌లో బిగ్ షాక్!

బాక్సాఫీస్ వద్ద చతికిలబడ్డ 'ఏక్ దిన్'... సాయి పల్లవికి బాలీవుడ్‌లో బిగ్ షాక్!

Telugu Samayam 1 week ago

తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో తన నటన, డ్యాన్స్‌లతో 'ఫిదా' చేసిన నటి సాయి పల్లవి. సౌత్ ఇండియాలో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బాలీవుడ్ అరంగేట్రం ఎట్టకేలకు 'ఏక్ దిన్' చిత్రంతో జరిగింది.

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ ఈ సినిమాతో హీరోగా పరిచయం కావడం, ఆమిర్ ఖాన్ స్వయంగా నిర్మించడం వంటి అంశాలతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది.

కలెక్షన్ల పరంగా భారీ దెబ్బ
తొలి రోజే మిశ్రమ స్పందన రావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం వెలవెలబోతోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, మొదటి రోజు దేశవ్యాప్తంగా కేవలం రూ. 1.37 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే సాధించిన ఈ చిత్రం, రెండో రోజు (శనివారం) మరింత క్షీణించి రూ.1 కోటి మార్కుకే పరిమితమైంది. రెండు రోజుల్లో కలిపి భారత బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 2.15 కోట్ల నెట్, రూ. 2.57 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా పరిస్థితి దారుణంగా ఉంది. ఓవర్సీస్‌లో రెండు రోజులకు కలిపి కేవలం రూ. 25 లక్షలు మాత్రమే వసూలయ్యాయి. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 2.82 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే సాధించి 'డిజాస్టర్' దిశగా పయనిస్తోంది. ఆమిర్ ఖాన్, సాయి పల్లవి వంటి పేర్లు కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయాయి.

* మ్యాచో స్టార్ వేట మొదలైంది... గ్రాండ్‌గా ప్రారంభమైన గోపీచంద్ 34వ చిత్రం!

కథా నేపథ్యం ఏమిటి?
థాయ్ చిత్రం 'వన్ డే'కి అధికారిక రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రం, జపాన్ నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన ప్రేమకథ. ఐటీ ఉద్యోగి అయిన దినేష్ (జునైద్ ఖాన్) తన సహోద్యోగి మీరా (సాయి పల్లవి)ని ప్రాణంగా ప్రేమిస్తుంటాడు. అయితే తన ప్రేమను చెప్పలేక లోలోపలే మదనపడే సిగ్గరి యువకుడు అతను. ఆఫీస్ ట్రిప్ నిమిత్తం జపాన్ వెళ్ళినప్పుడు, మీరా 'ట్రాన్సియెంట్ గ్లోబల్ ఆమ్నీషియా' (TGA) అనే వ్యాధి బారిన పడి 24 గంటల పాటు తన జ్ఞాపకశక్తిని కోల్పోతుంది. ఆ ఒక్క రోజును (ఏక్ దిన్) తనకు అనుకూలంగా మార్చుకుని, తామిద్దరం ప్రేమికులమని ఆమెను నమ్మించి, తన కలను నెరవేర్చుకోవాలని దినేష్ ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత జరిగే పరిణామాలే ఈ సినిమా ఇతివృత్తం.

* హాలీవుడ్ తెరపై 'అబూ'గా మెరవాల్సిన మెగాస్టార్ .. ఆ ప్రయోగం ఎందుకు ఆగిపోయింది?

మైనస్‌లు ఇవే..
సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడానికి ప్రధాన కారణం కథనంలో బలం లేకపోవడమేనని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. సాయి పల్లవి తన నటనతో మెప్పించినప్పటికీ, జునైద్ ఖాన్ ఆమె పక్కన తేలిపోయారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అస్సలు కుదరకపోవడం ప్రేక్షకులను అసహనానికి గురిచేసింది. హీరోగా జునైద్ ఖాన్ నటనలో అనుభవం లేమి స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో ఆయన ప్రభావం చూపలేకపోయారు. చిత్రంలో చెప్పుకోదగ్గ ట్విస్టులు, పకడ్బందీ డ్రామా లేకపోవడం మరో లోపం. పాటలు కూడా అంతగా ఆకట్టుకోలేదు. కేవలం జపాన్‌లోని బ్యూటిఫుల్ లొకేషన్లు మాత్రమే కాస్త ఉపశమనాన్ని ఇచ్చాయి.


ప్రస్తుతం బాలీవుడ్‌లో స్పై, యాక్షన్ చిత్రాల ట్రెండ్ నడుస్తున్న వేళ ఒక సున్నితమైన ప్రేమకథను చెప్పాలనే ఆమిర్ ఖాన్ ప్రయత్నం ప్రశంసనీయమే అయినా దానిని ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో విఫలమయ్యారు. వీక్ డేస్‌లో ఈ వసూళ్లు మరింత తగ్గే అవకాశం ఉన్నందున 'ఏక్ దిన్' బాక్సాఫీస్ వద్ద గట్టెక్కడం కష్టంగానే కనిపిస్తోంది. దీంతో సాయిపల్లవి హిందీ డెబ్యూ మూవీ డిజాస్టర్ ఫలితాన్ని అందుకోబోతోంది. ఇక ఆమె ఆశలన్నీ 'రామాయణ' మీదే ఉన్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam