Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Bandla Ganesh: 'నా పేరు మీద రాజకీయాలు చేయకండి.. పదవులపై నాకు వ్యామోహం లేదు'.. బండ్ల గణేష్ కీలక ప్రకటన

Bandla Ganesh: 'నా పేరు మీద రాజకీయాలు చేయకండి.. పదవులపై నాకు వ్యామోహం లేదు'.. బండ్ల గణేష్ కీలక ప్రకటన

Telugu Samayam 1 month ago

ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నా.. రాజకీయ నాయకులకు మాత్రం దగ్గరగానే ఉంటున్నారు. గతంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన..

గత కొన్నాళ్లుగా టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుపై తన అభిమానాన్ని చాటుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే బండ్ల గణేష్ పేరుతో కొన్ని రోజులుగా పలు రకాల రూమర్లు, ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రచారంపై ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా స్పందించిన గణేష్.. తాజాగా ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. తనకు పదవులపై వ్యామోహం లేదని, అనవసర వివాదాల్లోకి లాగొద్దంటూ అసహనం వ్యక్తం చేశారు.

''ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నాకు ఎలాంటి పదవులు, హోదాలు, అధికారాలపై వ్యామోహం లేదు. ప్రజలు ఇన్నేళ్లుగా అందించిన ప్రేమ, అభిమానంతో నేను సంపాదించుకున్న గౌరవమే నాకు ఎంతో విలువైనది. నా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నా ఆలోచనలు, నా ప్రయాణం, నేను ఎవరో నన్ను దగ్గరగా చూసిన వారికి తెలుసు''

''అందుకే ఒక స్పష్టమైన మనవి. దయచేసి లేనిపోని విషయాలను నా పేరుతో ముడిపెట్టకండి. నా ప్రమేయం లేని విషయాల్లో నా పేరును ఉపయోగించకండి. నేను చెప్పనిది నా మాటగా, నేను చేయనిది నా పనిగా ప్రచారం చేయకండి. పుకార్లకు, గాలి వార్తలకు స్పందించకపోవడం నా సంయమనం మాత్రమే. నా పేరును అనవసరమైన వివాదాలకు దూరంగా ఉంచండి. నా పేరు మీద రాజకీయాలు చేయకండి. నా పేరును రాజకీయాలకు ఉపయోగించకండి'' అని బండ్ల గణేష్ తన ప్రకటనలో పేర్కొన్నారు.


జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన బండ్ల గణేష్.. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా భవనేశ్వరిపై తన గౌరవాభిమానాలను చాటుకుంటున్నారు. తన కుమార్తె పెళ్లి పత్రికపై చంద్రబాబు దంపతుల పేర్లు ముద్రించడం చర్చనీయంగా మారింది. అంతేకాదు కొద్దిరోజుల క్రితం గణేష్ చిత్తూరు జిల్లా నారావారిపల్లెకు వెళ్లి.. అక్కడ చంద్రబాబు తల్లిదండ్రులైన ఖర్జూర నాయుడు, అమ్మణ్ణమ్మల సమాధుల వద్ద నివాళులర్పించారు. "ఎంత గొప్ప బిడ్డను కన్నారమ్మా" అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

2023లో చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్లినప్పుడు.. ఆయన బయటకు వచ్చి మళ్లీ సీఎం కావాలని బండ్ల గణేష్ శ్రీవెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారు. చంద్రబాబు గెలిచిన తర్వాత షాద్‌నగర్ నుంచి కాలినడకన తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇలా అనేక సందర్భాల్లో చంద్రబాబు మీద తనకున్న అభిమానాన్ని ఏదో ఒక రూపంలో చాటుకుంటూనే ఉన్నారు. దీంతో బండ్ల గణేష్‌కు కూటమి ప్రభుత్వంలో ఏదో ఒక పదవి దక్కడం ఖాయమనే ఊహాగానాలు వినిపించాయి. ఏదో ఒక రాజకీయ పదవి లేదా నామినేటెడ్ పోస్టు రాబోతోందంటూ ప్రచారం జరిగింది. వీటిపై ఇటీవల ఎక్స్ వేదికగా బండ్ల గణేష్ స్పందించారు.

''దారి ఎంత కఠినమైనదైనా దాటే ధైర్యం నాది. ఎలాంటి పరిస్థితుల్లోనూ కుంగిపోకుండా నిలబడే పట్టుదల నాది. ఈ రోజు కాకపోయినా, రేపు విజయం నాదేనన్న నమ్మకం నాది. నిజాయితీ నా బలం.. నమ్మకం నా ఆయుధం.. విజయం వరకు పోరాటమే నా ప్రయాణం''.. ''దయచేసి మీ టైమ్‌పాస్ కోసం నా పేరు వాడి, నా జీవితానికి అన్యాయం చేయొద్దని చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నాకు ఎలాంటి పదవుల మీద, హోదాల మీద, మరే విషయాల మీదా ఎలాంటి వ్యామోహం కానీ, ఆశ కానీ లేదు. లేనిపోని విషయాలు మాట్లాడి నా పేరును ఉపయోగించి నాకు ఇబ్బందులు కలిగించొద్దని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకుని, నా పేరు ఉపయోగించకుండా నాకు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని చేతులెత్తి నమస్కరిస్తున్నాను'' అంటూ బండ్ల గణేష్ వరుస ట్వీట్లు పెట్టారు. ఇప్పుడు ప్రెస్ నోట్ ద్వారా మరోసారి ఘాటుగా స్పందించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam