పశ్చిమ్ బెంగాల్‌లోని బరుయ్‌పుర్‌లో 11 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుల్లో ఒకడైన ప్రభాస్ మోండల్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.
బుధవారం తెల్లవారుజామున సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం నిందితుడ్ని తీసుకెళ్లిన సమయంలో.. తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఓ పోలీసు దగ్గర తుపాకీ లాక్కొని పరిపోవడానికి యత్నించిన నిందితుడు.. కాల్పులు కూడా జరిపినట్టు పేర్కొన్నారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో గాయపడిన అతడ్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ప్రధాన నిందితుల్లో ఒకడైన మోండల్ చిన్నారి కనిపించకుండా పోవడానికి ముందు పాపతో కలిసి ఉన్నట్లు సీసీటీవీ దృశ్యాల్లో గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తునకు సిట్ వేసిన బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి.. 72 గంటల్లో నివేదిక అందజేయాలని ఆదేశించారు.
ఇదిలా ఉండగా, ప్రభాస్ మోండల్ ఎన్‌కౌంటర్‌పై తల్లిదండ్రులు స్పందించారు. తమ కుమారుడు ఏమీ మంచి పని చేసి చనిపోలేదని, అందుకే మృతదేహాన్ని చివరిసారిగా కూడా తమ ఇంటికి తీసుకొచ్చేది లేదని తల్లిదండ్రులు పేర్కొన్నారు. చేసిన పనికి తగిన శాస్తే జరిగిందని, ఇకపై ఎలాంటి అధికారిక ప్రక్రియలతో తనకు సంబంధం లేదని అతడి తల్లి సంధ్యా మోండల్ స్పష్టం చేశారు.
''చేసిన తప్పునకు నా కొడుకు శిక్ష అనుభవించాడు.. అతడి మృతదేహాన్ని నేను మా ఇంటికి తీసుకురాను. అతడు ఏ మంచి పనీ చేయలేదు. తప్పు చేశాడు, శిక్ష పడింది. అతడిని చంపేయండి లేదా మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు'' అని ఏఎన్ఐ వార్త సంస్థతో అన్నారు.
ఆమె భర్త అనారోగ్యంతో ఉన్నాడనే కారణంతో.. కొడుకు మరణవార్త చెప్పడానికి ఇద్దరు పోలీసులు ఇంటికి వచ్చినప్పుడు ఆమె కనీసం ఆసుపత్రికి వెళ్లడానికి కూడా నిరాకరించారు. ''నాకు ఎలాంటి అభ్యంతరం లేదని, మీకు నచ్చింది చేసుకోమని నేను వారితో (పోలీసులతో) చెప్పాను'' అని ఆ తల్లి ఆవేదనతో వెల్లడించారు. బాలికకు మాయమాటలు చెప్పి అతడే నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి.. మరో ఇద్దరితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడి.. తర్వాత ప్రాణాలతో ఉండగానే చెరువులో పడేశారు.
స్థానికులు మోండల్‌ను గుర్తించి పోలీసులకు అప్పగించడంతో ఆదివారం చెరువులో బాలిక మృతదేహాన్ని వెలికితీశారు. ఆనంద సర్దార్, దిబాకర్ సర్దార్ అనే మరో ఇద్దరిని కూడా అరెస్టు చేశారు. వారు నేరాన్ని అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పోస్ట్‌మార్టం నివేదికలో చిన్నారిపై లైంగిక వేధింపులు జరిగినట్టు నిర్దారణ అయ్యింది. ఆమె ఒంటిపై గాయాలు,గీతలు కాకుండా, ఆమె ప్రైవేట్ భాగాలకు తీవ్రమైన గాయాలు ఉన్నట్లు వెల్లడించింది.

