దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదమైన ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ.. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ కొంప ముంచింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా చనిపోయిన, డూప్లికేట్ ఓటర్లను గుర్తించిన కేంద్ర ఎన్నికల సంఘం..
ఆ రాష్ట్రంలో ఏకంగా 90 లక్షలకు పైగా ఓట్లను తొలగించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియపై మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసింది. అయితే ఆ ఎస్ఐఆర్ ప్రక్రియ కారణంగానే ఇప్పుడు బెంగాల్‌లో మమతా బెనర్జీ హ్యట్రిక్ ప్రభుత్వం.. అధికారానికి దూరమైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓట్ల తొలగింపు జరిగిన నియోజకవర్గాల్లో టీఎంసీ డీలా పడగా.. బీజేపీ భారీగా పుంజుకుని ఆ స్థానాలను కైవసం చేసుకుంది.
ఓట్ల తొలగింపుల సంఖ్య ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ భారీగా లాభపడినట్లు తాజా ఎన్నికల సంఘం గణాంకాల ద్వారా తెలుస్తోంది. బెంగాల్‌లో 25 వేలకు పైగా ఓట్లను తొలగించిన నియోజకవర్గాలు 147 ఉన్నాయి. అయితే తాజా ఎన్నికల్లో ఈ 147 సీట్లలో బీజేపీ 95 స్థానాల్లో విజయం సాధించింది. అదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కేవలం 51 స్థానాలకే పరిమితమైంది. ఇక 15 వేల నుంచి 25 వేల మధ్య ఓట్లు తొలగించిన నియోజకవర్గాలు మొత్తం 67 ఉండగా.. అందులో బీజేపీ సీట్లలో 47 గెలవగా.. టీఎంసీ 19 స్థానాల్లోనే విజయం సాధించింది.
READ ALSO: బెంగాల్‌లో దీదీ ఓటమికి మేనల్లుడే కారణమా.. అభిషేక్ బెనర్జీ తీరే సువేందును పార్టీ నుంచి వెళ్లగొట్టిందా?
మరోవైపు.. 5 వేల నుంచి 15 వేల మధ్య ఓట్లు తొలగించిన స్థానాలు 62 ఉండగా.. అందులో బీజేపీ 50 సీట్లలో విజయం సాధించగా.. మిగిలిన 12 నియోజకవర్గాలు టీఎంసీ ఖాతాలో పడ్డాయి. ఇక 5 వేల లోపు ఓట్లను తొలగించిన నియోజకవర్గాలు 13 ఉండగా.. ఆ స్థానాలు మొత్తం బీజేపీనే కైవసం చేసుకుంది. ఇక జిల్లాల పరంగా చూస్తే.. అత్యధికంగా ఓట్లు తొలగించిన జిల్లాల్లో టీఎంసీ పార్టీ బలం గణనీయంగా తగ్గిందని వెల్లడి అవుతోంది.
READ ALSO: మమతా బెనర్జీ, పినరయి విజయన్, ఎంకే స్టాలిన్ కంచుకోటలు బద్దలు.. 3 రాష్ట్రాల్లో మారనున్న ప్రభుత్వాలు
బెంగాల్‌లోనే అత్యధికంగా ముర్షిదాబాద్ జిల్లాలో 4.55 లక్షల మంది ఓటర్లను ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా తొలగించారు. 2021లో ఆ జిల్లాలో ఉన్న 22 సీట్లలో 20 స్థానాల్లో టీఎంసీ విజయం సాధించగా.. ఈ ఎన్నికల్లో మాత్రమే 9 సీట్లకే పరిమితం కావడంతో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తర 24 పరగణాలు జిల్లాలో 3.25 లక్షల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారు. గతంలో ఈ ఉత్తర 24 పరగణాల జిల్లాలో 28 సీట్లు గెలిచిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ.. ఈసారి కేవలం 8 స్థానాలకే పడిపోయి.. ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. మాల్దా జిల్లాలో 2.39 లక్షల పేర్లు తొలగించగా.. అక్కడ గతంలో టీఎంసీ 8 సీట్ల నుంచి 6 సీట్లకు తగ్గింది.
బంగ్లాదేశ్‌తో సరిహద్దు పంచుకుంటున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ఓటర్ల సవరణ ప్రక్రియ అత్యంత వివాదాస్పదంగా మారింది. ఎస్ఐఆర్ ప్రక్రియకు ముందు బెంగాల్‌లో 7.66 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. తుది జాబితా నాటికి 63.66 లక్షల పేర్లు తొలగించారు. ఆ తర్వాత జరిగిన న్యాయపరమైన పరిశీలనలో మరో 27.16 లక్షల మందిని అనర్హులుగా తేల్చడంతో మొత్తం దాదాపు 91 లక్షల మంది ఓట్లను తొలగించినట్లయించింది. దీంతో ఈ ప్రక్రియ అంతా పూర్తి అయ్యేసరికి బెంగాల్ వ్యాప్తంగా మొత్తం 90,83,345 మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తీసేశారు. భారీగా ఓటర్లను తొలగించడమే.. బెంగాల్ రాజకీయాల్లో అధికార మార్పిడికి ఒక ముఖ్య కారణమని రాజకీయ విశ్లేషణలు పేర్కొంటున్నాయి.

