Dailyhunt
బెంగాల్‌లో ఒవైసీ అట్టర్ ప్లాప్.. MIM పోటీచేసిన 12 స్థానాల్లోనూ డిపాజిట్లు గల్లంతు

బెంగాల్‌లో ఒవైసీ అట్టర్ ప్లాప్.. MIM పోటీచేసిన 12 స్థానాల్లోనూ డిపాజిట్లు గల్లంతు

Telugu Samayam 6 days ago

ప్రతిపక్షాల ముస్లిం ఓట్లను చీల్చి బీజేపీకి 'బి-టీమ్'గా వ్యవహరిస్తోందనే ఆరోపణలను ఎదుర్కొంటోన్న అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం..

పశ్చిమ్ బెంగాల్ ఎన్నికల్లోనూ పోటీచేసింది. మొత్తం 12 నియోజకవర్గాల్లో పోటీచేసిన ఆ పార్టీ అన్ని చోట్లా డిపాజిట్లను కోల్పోయింది. ఒక్క స్థానంలో తప్ప మిగతా చోట్ల ఆ పార్టీ అభ్యర్థులకు పట్టుమని 10 వేల ఓట్లు రాలేదు. తాము మమతా బెనర్జీ టీమ్ అని, ఈ సీట్ల ఎంపిక ఉద్దేశపూర్వకమేనని అసదుద్దీన్ ఒవైసీ పోలింగ్‌కు ముందు అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మాజీ నేత హుమాయున్ కబీర్ ఏర్పాటుచేసిన ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీతో ముందు ఎంఐఎం పొత్తు పెట్టుకుంది. కానీ, టీఎంసీ మైనారిటీ ఓట్లను చీల్చడానికే కబీర్‌కు బీజేపీ సాయం చేస్తోందని ఆరోపిస్తున్న వీడియో బయటకు రావడంతో ఆ పార్టీతో కటీఫ్ చెప్పింది.

మాల్దా, ముర్షీదాబాద్, బీర్బుమ్, పశ్చిమ్ బర్ధమాన్, ఉత్తర 24 పరగణాలు, ఉత్తర దినాజ్‌పూర్‌ ఏడు జిల్లాలోని 12 నియోజక వర్గాల్లోని మోథాబరి, సుజాపూర్, సుతి, రఘునాథ్‌గంజ్, కండి, నలహతి, మురారయ్, అసన్‌సోల్ నార్త్, హబ్రా, బరాసత్, బసిర్‌హట్ సౌత్, కరిందిఘిలో తన అభ్యర్థులను పోటీకి దింపింది. ఎస్ఐఆర్‌లో అధికంగా ఓట్లు తొలగించిన 10 సీట్లలో సుతి, రఘనాథ్‌గంజ్‌లు కూడా ఉన్నాయి. కరిందిఘిలోనూ 31,562 ఓట్లను తొలగించారు.

బిహార్‌లోని మైనారిటీలు అధికంగా ఉన్న సీమాంచల్‌కు సమీపంలో ఉండటం, అలాగే సెంట్రల్, ఉత్తర బెంగాల్‌లోని సరిహద్దు జిల్లాల్లోని ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలు కావడంతో వీటిని ఎంఐఎం ఎంపిక చేసుకుంది. ముస్లిం ఓట్లు గంపగుత్తగా తమకు పడతాయని ఎంఐఎం భారీ ఆశలు పెట్టుకుంది. కానీ, ముస్లింలు మాత్రం టీఎంసీకే మొగ్గుచూపారు. మొత్తం 12 స్థానాల్లో 9 చోట్ల టీఎంసీ గెలవగా.. మూడు సీట్లలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఎంఐఎం పోటీచేసిన నియోజకవర్గాల్లో హిందువులు, ముస్లింల ఓట్లు సమానంగానే ఉన్నాయి. గత ఎన్నికల్లో 12 చోట్ల టీఎంసీ విజయం సాధించగా.. సగటు మెజార్టీ 55 వేలు. గత ఎన్నికల్లో ఆరు స్థానాల్లో పోటీచేసిన ఎంఐఎం.. 093 శాతం ఓట్లు సాధించింది. ఈసారి మాత్రం 00.9 శాతం మాత్రమే దక్కాయి.

కానీ, గతేడాది జరిగిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సీమాంచల్‌లో తన ఐదు సీట్లను ఎంఐఎం నిలబెట్టుకుంది. అందుకే ఆ ప్రాంతానికి సమీపంలోని మధ్య, ఉత్తర బెంగాల్‌లో తమ ఉనికిని విస్తరించుకోవాలని భావించింది. కానీ, మైనార్టీ వర్గం అసదుద్దీన్ ఒవైసీ ఆశలపై నీళ్లుచల్లింది. ఏ ఒక్క దగ్గర కూడా వారికి డిపాజిట్ దక్కకపోవడం గమనార్హం.

ఇక, అసోంలో బద్రుద్దీన్ అజ్మల్ నేతృత్వంలోని ఏఐయూడీఎఫ్‌కు, తమిళనాడు, పుదుచ్చేరిలో డీఎంకేకు మద్దతు ఇచ్చింది. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌లో భాగమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్)కు మద్దతు ఇచ్చింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam