Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారీగా బంగారం స్మగ్లింగ్.. మళ్లీ సుంకాల్ని తగ్గించే యోచనలో మోదీ సర్కార్.. అదే జరిగితే!

భారీగా బంగారం స్మగ్లింగ్.. మళ్లీ సుంకాల్ని తగ్గించే యోచనలో మోదీ సర్కార్.. అదే జరిగితే!

Telugu Samayam 2 weeks ago

Gold Smuggling Rise India: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అమెరికా- ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియా ఉద్రిక్తతల సమయంలో కేంద్ర ప్రభుత్వం మే నెలలో బంగారం, వెండిపై ఉన్నట్లుండి దిగుమతి సుంకాల్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. భారత విదేశీ మారక నిల్వలు తగ్గిపోకుండా, రూపాయిని స్థిరంగా ఉంచేందుకు అప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

అయితే ఇప్పుడు మళ్లీ కేంద్రం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అవును.. గోల్డ్, సిల్వర్‌పై దిగుమతి సుంకాల్ని (ఇంపోర్ట్స్ డ్యూటీ) తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అంతర్గతంగా విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. ఈ మేరకు కొందరు అధికారుల్ని ఉటంకిస్తూ మనీ కంట్రోల్ నివేదించింది. అదే 15 శాతం నుంచి మళ్లీ 6 శాతానికి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే బంగారం ధరలు కాస్త అదుపులోకి వస్తాయి.

బంగారం, వెండి వంటి విలువైన లోహాలపై అధిక పన్నుల భారం నేపథ్యంలో, అధికారికంగా దిగుమతులు తగ్గినప్పటికీ ఇదే సమయంలో అక్రమంగా దేశంలోకి వచ్చే బంగారం పెరిగినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అంటే గోల్డ్ స్మగ్లింగ్ మళ్లీ పెరిగిందన్నమాట. పన్ను భారం తగ్గించుకోవడంలో భాగంగానే విదేశాల నుంచి ఇలా అక్రమంగా బంగారం తరలిస్తుంటారు. ఈ క్రమంలోనే దిగుమతి సుంకాల్ని తగ్గించడం ద్వారా పసిడి అక్రమ రవాణా కూడా తగ్గించాలని కేంద్రం చూస్తున్నట్లు తెలిసింది. అప్పుడు అధికారికంగానే దిగుమతులు మరిన్ని పెరుగుతాయని భావిస్తోంది.

ముఖ్యంగా భారత ఆభరణాల తయారీ పరిశ్రమల ప్రతినిధులు, బులియన్ వ్యాపారులు ఈ కస్టమ్స్ డ్యూటీని 15 నుంచి 6 శాతానికి తీసుకురావాలని కేంద్రాన్ని కోరుతున్నారు. దీంతో కేంద్రం దీన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అయితే ఇప్పటివరకు మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. సుంకాలు తగ్గించే అంశంపై చర్చలు ఇంకా జరుగుతున్నాయని, దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

తగ్గిన దిగుమతులు కానీ స్మగ్లింగ్‌తో ఆందోళన!

అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధం భీకర స్థాయిలో ఉన్నప్పుడు 2026, మే 13న కేంద్రం- గోల్డ్, సిల్వర్ సహా ఇతర లోహాలపై కస్టమ్స్ సుంకాల్ని 6 నుంచి 15 శాతానికి పెంచింది. యుద్ధం సమయంలో బంగారం ధరలు తగ్గడంతో భారీగా కొనుగోళ్లు జరిగాయి. ఇక్కడ భారతదేశం బంగారం అవసరాల్లో మెజార్టీ భాగం దిగుమతులపైనే ఆధారపడుతుంది. ఇందుకోసం డాలర్లలో చెల్లింపులు చేయాలి. ఇది రూపాయిపై ఒత్తిడిని పెంచుతుంది. విదేశీ మారక నిల్వల్ని తగ్గిస్తుంది. దీంతో అలా జరగకుండా ఉండేందుకు కేంద్రం- బంగారం, వెండి కొనుగోళ్లను తగ్గించే దిశగా అడుగులు వేసింది. దాంట్లో భాగంగా ముందుగా భారతీయులు ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను నిలిపివేయాలని కోరారు. తర్వాత వెంటనే దిగుమతి సుంకాల్ని పెంచారు. ఆ తర్వాత దిగుమతులపై పరిమితులు కూడా విధించింది. దీంతో ఏప్రిల్ నెలలో 82 శాతం వరకు పెరిగిన పసిడి దిగుమతులు, సుంకాల పెంపు తర్వాత 32 శాతానికి తగ్గింది. అయితే ఆ మేర స్మగ్లింగ్ పెరిగిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మళ్లీ సుంకాల్ని తగ్గించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam