Dailyhunt
భాషకో హీరో.. 38 ఏళ్ల క్రితమే పాన్ ఇండియా ప్రయోగం.. 'శాంతి క్రాంతి' వెనుక అసలు కథ!

భాషకో హీరో.. 38 ఏళ్ల క్రితమే పాన్ ఇండియా ప్రయోగం.. 'శాంతి క్రాంతి' వెనుక అసలు కథ!

Telugu Samayam 2 weeks ago

ప్పుడంటే ఇండియన్ సినిమా మొత్తం పాన్ ఇండియా ట్రెండ్ చుట్టూ నడుస్తోంది. ఒక సినిమాని పలు భాషల్లో తెరకెక్కించి ఒకేసారి రిలీజ్ చేయడమే ఆ ట్రెండ్. అయితే మూడున్నర దశాబ్దాల క్రితమే ఈ సాహసానికి తెరలేపారు కన్నడ క్రేజీ స్టార్ వి.

రవిచంద్రన్. 'ప్రేమలోక', 'రణధీర' వంటి భారీ విజయాల తర్వాత, నాలుగు భాషల్లో అగ్ర హీరోలతో ఆయన రూపొందించిన విజువల్ వండర్ "శాంతి క్రాంతి".

సూపర్ స్టార్ కృష్ణ నిర్మించిన 'సింహాసనం' స్ఫూర్తితో రవిచంద్రన్ ఈ భారీ ప్రాజెక్టును తలపెట్టారు. 1988లో సినిమా ప్రకటించినప్పుడు బడ్జెట్ 6 కోట్లు. అప్పట్లో సౌత్ ఇండియాలో 4 కోట్ల షేర్ రాబట్టిన సినిమాలే లేవు. అలాంటి సమయంలో 6 కోట్లతో సినిమా అంటే ఇండస్ట్రీ అంతా విస్మయానికి గురైంది. రవిచంద్రన్ మేకింగ్ స్టైల్‌పై నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్సియర్లు భారీగా పెట్టుబడులు పెట్టారు. ఈ సినిమాను తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ భాషల్లో వేర్వేరు హీరోలతో చిత్రీకరించారు. తెలుగులో తొలుత చిరంజీవిని అనుకున్నా డేట్స్ కుదరకపోవడంతో నాగార్జునను తీసుకున్నారు. తమిళం & హిందీలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించారు. (తమిళంలో 'నాట్టుక్కు ఒరు నల్లవన్' అని టైటిల్ పెట్టారు). కన్నడలో రవిచంద్రన్ స్వయంగా నటించగా... అన్ని భాషల్లోనూ జుహీ చావ్లా, ఖుష్బూ హీరోయిన్లుగా నటించారు. కన్నడ కమెడియన్ బుల్లెట్ ప్రకాష్ ఈ సినిమాతోనే బాల నటుడిగా పరిచయమయ్యారు.

* 'భోగి'లో కందుల సులోచనా రాణి'.. పల్లెటూరి పిల్లగా అనుపమ పరమేశ్వరన్ ఊరమాస్ లుక్

అదుపు తప్పిన బడ్జెట్
1988 నవంబర్ 14న షూటింగ్ మొదలైనా, స్క్రిప్ట్ మార్పులు, నాలుగు భాషల నటులతో విడివిడిగా షూట్ చేయడం వల్ల బడ్జెట్ అదుపు తప్పింది. సినిమా ఆగిపోయే దశకు చేరుకున్నా, రవిచంద్రన్ తండ్రి సహకారంతో వెనక్కి తగ్గలేదు. ఆస్తులు అమ్మడం, భూములు తాకట్టు పెట్టడం ద్వారా నిధులు సేకరించారు. కేవలం క్లైమాక్స్ ఫైట్ కోసమే కోటి రూపాయలకు పైగా ఖర్చు చేశారు. ఫలితంగా 6 కోట్ల బడ్జెట్ కాస్తా 10 కోట్లకు చేరింది. రెండేళ్ల నిరీక్షణ తర్వాత 1991 సెప్టెంబర్ 19న తెలుగు, కన్నడ వెర్షన్లు, అక్టోబర్ 2న హిందీ, తమిళ వెర్షన్లు విడుదలయ్యాయి. క్రేజీ స్టార్స్ ఉండటంతో రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసలు దక్కినా, కథనం గాడి తప్పడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. మొత్తంగా 10 కోట్ల బడ్జెట్‌కు గాను 4 కోట్లు మాత్రమే వసూలు కావడంతో రవిచంద్రన్‌కు 6 కోట్ల భారీ నష్టం మిగిలింది. ఆ నష్టాల నుండి బయటపడటానికి ఆయన ఆ తర్వాత వరుసగా రీమేక్ సినిమాలపై ఆధారపడాల్సి వచ్చింది.

* ఆ స్టార్ హీరోకి భార్య ఉన్నా గర్ల్‌ఫ్రెండ్‌తోనే ఉంటాడు.. ఫుల్లుగా తాగేసి సెట్స్‌కి టైమ్‌కి రాడు - జేడీ

కథాంశం
ఈ సినిమా ప్రధానంగా సమాజంలోని అవినీతి, పిల్లల అక్రమ రవాణా నేపథ్యంలో సాగుతుంది. సమాజంలో అనాథ పిల్లలను దొంగిలించి, వారి శరీర భాగాలను విక్రయించే ఒక ముఠా ఆగడాలను అరికట్టడం చుట్టూ కథ తిరుగుతుంది. తెలుగు వెర్షన్‌లో నాగార్జున హీరోగా నటించారు. ఆయన ఒక ధైర్యవంతుడైన పోలీస్ పాత్రలో ఈ అసాంఘిక కార్యకలాపాలను సాగిస్తున్న ముఠా నాయకుడిని ఎలా ఎదుర్కొన్నారు అనేది సినిమా ప్రధాన ఇతివృత్తం. శాంతి (Peace), క్రాంతి (Revolution) అనే రెండు సిద్ధాంతాల ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలనే సందేశాన్ని ఈ చిత్రం ఇస్తుంది. ఈ సినిమాకు హంసలేఖ అందించిన సంగీతం అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది. ఏది ఏమైనా టెక్నాలజీ లేని ఆ రోజుల్లోనే అంతటి భారీ సాహసం చేసిన రవిచంద్రన్ ప్రయత్నం భారతీయ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam