విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఈ నెల 1న ప్రారంభమైంది. ప్రధాని మోదీ ఎయిర్‌పోర్ట్‌ను జాతికి అంకితం చేశారు.
ప్రారంభోత్సవం రోజు సభా వేదికపై ఏర్పాటు చేసిన స్క్రీన్‌పై 'వైజాగ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం'గా పేర్కొనడంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. భోగాపురం కాకుండా 'వైజాగ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం'గా ఎందుకు పేర్కొన్నారంటూ కొంతమందికి సందేహాలు మొదలయ్యాయి. ఈ అంశంపై తాజాగా ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టత ఇచ్చారు. సివిల్ ఏవియేషన్ అథారిటీ సూచనల మేరకు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి వైజాగ్ పేరు పేర్కొన్నట్లు తెలిపారు. ఈ అంశంపై సోషల్ మీడియాలో, మీడియాలో చర్చ జరుగుతోందని.. వెంటనే ఈ వదంతులకు పుల్‌స్టాప్ పెట్టాలని మంత్రి శ్రీనివాస్ కోరారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రంగారెడ్డి జిల్లాలో ఉందని గుర్తు చేసిన మంత్రి శ్రీనివాస్.. కానీ ఆ విమానాశ్రయాన్ని హైదరాబాద్ లేదా శంషాబాద్‌గా పిలుస్తున్నామన్న సంగతి గమనించాలన్నారు. విజయనగరం జిల్లాలో భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం రెవెన్యూ పరంగా ఉందని.. కానీ వైజాగ్ అని పిలవడంలో తప్పులేదన్నారు. 70శాతం స్థానికులకే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో బ్లూ కాలర్ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. అర్హత, అనుభవం ఇతర అంశాలను బట్టి వైట్ కాలర్ ఉద్యోగాలలో నియమిస్తారన్నారు. ఉద్యోగాల విషయంలో ఎవరికి ఎలాంటి అపోహలు అవసరంలేదన్నారు. ఈ అంశంపై మరోసారి జీఎంఆర్ సంస్థతో మాట్లాడతామన్నారు.
భోగాపురం విమానాశ్రయంప్రారంభోత్సవంతో పాటుగా ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి మంత్రి అభినందనలు తెలిపారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవంలో విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి కీలకపాత్ర పోషించారన్నారు. విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎస్ రామ సుందర్ రెడ్డిని కలిసి శాలువాతో సత్కరించి అభినందించారు. ప్రధాని మోదీ షెడ్యూలూ ప్రకటించిన రోజు నుంచి పక్కాగా ఏర్పాట్లు చేశారని.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు. అన్ని శాఖల అధికారులతో పాటుగా ప్రజలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అభినందనలు తెలిపారు.

