Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భోగాపురం: 13 వేల మందితో థింసా నృత్యం.. మనసును తాకిందంటూ మోదీ ఆనందం..

భోగాపురం: 13 వేల మందితో థింసా నృత్యం.. మనసును తాకిందంటూ మోదీ ఆనందం..

Telugu Samayam 1 week ago

త్తరాంధ్ర వాసుల కల నెరవేరింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.

భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధాని మోదీ.. ఇక్కడి జనం అద్భుత రీతిలో స్వాగతం పలికారు. ముఖ్యంగా 13,000 మందితో ప్రదర్శించిన థింసా నృత్యం కార్యక్రమానికే హైలెట్‌గా నిలిచింది. గిరిజనుల వస్త్రధారణ, ఆహార్యంతో లయబద్ధంగా అడుగులు వేస్తూ 13 వేల మందితో నిర్వహించిన ఈ ప్రదర్శన.. ప్రధానమంత్రి మోదీ మనస్సులోనే కాదు ప్రపంచ రికార్డుల్లోనూ చోటు దక్కించుకుంది. ఉత్సాహభరితంగా సాగిన థింసా నృత్యం తన మనసును తాకిందంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మీయతకు, రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి, మన గిరిజన సమాజాల గొప్ప సంప్రదాయాలకు ఈ అద్భుత ప్రదర్శన నిదర్శనంగా నిలిచిందని కొనియాడారు. అలాగే అత్యంత నైపుణ్యంతో హస్త కళతో రూపొందించిన బొబ్బిలి ఏకాండ వీణను అందుకోవడం కూడా ఎంతో ఆనందంగా ఉందని ప్రధాని ట్వీట్ చేశారు. భారతీయ సంగీత సంప్రదాయాల్లో వీణకు ఒక విశిష్ట స్థానం ఉందని.. ఈ వీణ ఆంధ్రప్రదేశ్ కళాకారుల అపూర్వ నైపుణ్యానికి ప్రతీకగా ప్రధాని అభివర్ణించారు.


మన బిడ్డలు గర్వకారణంగా నిలిచారు.. చంద్రబాబు

అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవంలో మన బిడ్డలు థింసా నృత్యంతో ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణంగా నిలిచారని సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాలకు చెందిన 13,000 మందికి పైగా ఆడబిడ్డలు తమ ప్రదర్శనతో ప్రపంచ రికార్డు సృష్టించారని.. మన సంప్రదాయాలు, భవిష్యత్ ఆకాంక్షలను అందంగా ప్రదర్శించారని ప్రశంసించారు.

మన అభివృద్ధి ప్రయాణంతో పాటు మన వారసత్వం కూడా ముందుకు సాగే "వికాస్ భీ, విరాసత్ భీ" యొక్క నిజమైన స్ఫూర్తి ఇదేనంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ సందర్భాన్ని ఇంత ప్రత్యేకంగా మార్చడంలో అంకితభావం, కృషి, అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఆడబిడ్డలకు, వారి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam