సింగరేణి భూగర్భ బొగ్గు గనులను ప్రైవేటుపరం చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ ప్రైవేటీకరణ అంశంపై సింగరేణి సంస్థ స్పందించింది. ప్రైవేటీకరణ వార్తలను యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. భూగర్భ గనుల ప్రైవేటీకరణకు సంబంధించి ప్రస్తుతం సింగరేణి వద్ద ఎలాంటి ప్రతిపాదన పరిశీలనలో లేదని స్పష్టం చేసింది.
బాధ్యతాయుతమైన ప్రభుత్వ రంగ సంస్థగా సింగరేణి బొగ్గు ఉత్పత్తి, దేశ ఇంధన భద్రతలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొంది. మైనింగ్ రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన సింగరేణి సంస్థ ప్రస్తుతం 21 భూగర్భ గనులు, 17 ఓపెన్‌కాస్ట్ గనుల ద్వారా బొగ్గు ఉత్పత్తి చేస్తుందని తెలిపింది. తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తదితర రాష్ట్రాలకు బొగ్గును సరఫరా చేస్తుందని.. దేశ ఇంధన భద్రతకు, పారిశ్రామిక అభివృద్ధికి నిరంతరం సంగరేణి తోడ్పడుతున్నట్లు వెల్లడించింది.
ప్రస్తుతం భూగర్భ గనులు ఆర్థికంగా నష్టాల్లో ఉన్నప్పటికీ, తెలంగాణ ప్రాంతంలోని వేలాది మందికి ఉపాధి కల్పన, ఉద్యోగ భద్రతను దృష్టిలో ఉంచుకుని నష్టాలను సాధ్యమైనంత మేర తగ్గిస్తూ వాటిని అలాగే కొనసాగిస్తున్నట్లు తెలిపారు. భూగర్భ గనులను మూసివేయడం, ప్రైవేటుపరం చేయడం కాకుండా వాటి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచటానికి దాంతో పాటు నిర్వహణ వ్యయాలను తగ్గించటం వంటి చర్యల ద్వారా సాధ్యమైనన్ని గనులను లాభదాయకంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు యాజమాన్యం వెల్లడించింది.
నష్టాల్లో ఉన్న శాంతిఖని భూగర్భ గనిలో ఉత్పత్తి కార్యకలాపాలను ఎండీవో విధానంలో నిర్వహించడం ద్వారా బొగ్గు ఉత్పత్తి వ్యయాలను తగ్గించగలమా, నష్టాలను నివారించగలమా అనే అంశాన్ని అధ్యయనం చేసేందుకు పైలట్ ప్రాజెక్టుగా ఒక ప్రతిపాదనను రూపొందించినట్లు సింగరేణి యాజమాన్యం వివరించింది. ఈ ఏడాది జనవరి 2న ఈవోఐ ప్రకటన జారీ చేసి, ఆసక్తిగల సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానించామని చెప్పింది. ముందు జనవరి 15వ తేదీ వరకు గడువు ఇవ్వగా ఏ సంస్థ కూడా ఆసక్తి వ్యక్తం చేయలేదని యాజమాన్యం వెల్లడించింది. అనంతరం గడువును జనవరి 22వ తేదీ వరకు పొడిగించగా ఒక సంస్థ మాత్రమే ముందుకొచ్చిందని తెలిపారు. అయితే తదుపరి దశలో ఆ సంస్థ కూడా ఈ ప్రక్రియలో కొనసాగేందుకు సంసిద్ధత వ్యక్తం చేయలేదన్నారు. ప్రైవేటీకరణ ప్రతిపాదనకు తగిన స్పందన లభించకపోవడంతో దానిని విరమించుకున్నట్లు సింగరేణి యాజమాన్యం వెల్లడించింది.
శాంతిఖని గనికి సంబంధించిన ఈవోఐ ప్రక్రియను కూడా ఇప్పటికే విరమించుకున్నామని తెలిపింది. భూగర్భ గనులను మరింత సమర్థ వంతంగా నిర్వహించటంతో పాటుగా నష్టాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. సాధ్యమైనన్ని గనులను లాభదాయకంగా మారుస్తామని.. తద్వారా తెలంగాణ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. అందుకు సింగరేణి సంస్థ నిరంతరం కృషి చేస్తుందన్నారు.

