Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భూముల ధరల సవరణకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. జూన్ 5 నుంచే అమల్లోకి

భూముల ధరల సవరణకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. జూన్ 5 నుంచే అమల్లోకి

Telugu Samayam 3 days ago

తెలంగాణలో భూముల ధరల సవరణకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సవరించిన ధరలు జూన్ 5 నుంచి అమల్లోకి వస్తాయని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

భూముల ధరలను సవరించాలని, కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గులున్న ధరలను క్రమబద్ధీకరించాలని క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆర్థిక నిపుణుడు అరవింద్ సుబ్రమణ్యం ఇచ్చిన నివేదిక, ఉన్నతాధికారుల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని విస్తృత స్థాయి అధ్యయనం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

ప్రాంతాల వారీగా మార్కెట్ పరిస్థితులు, ధరలు, ప్రభుత్వ విలువల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సమగ్రంగా పరిశీలించి శాస్త్రీయ పద్ధతిలో కొత్త విలువలను నిర్ణయించామని మంత్రి పేర్కొన్నారు. మార్కెట్ వాస్తవ ధరలకు, ప్రభుత్వ విలువలకు మధ్య భారీ వ్యతాస్యం ఉండటం వల్ల భూ లావాదేవీలలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు. ఈ పరిస్థితులను సరిదిద్దేందుకు చర్యలు తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. గ్రామీణ, పట్టణాల్లో స్థానిక పరిస్థితులను పరిశీలించి భూ విలువలను సవరించామని చెప్పారు.

ప్రాంతాల అభివృద్ధి సామర్థ్యం, వృద్ధి రేటు, ఇటీవల జరిగిన భూముల వేలం, మార్కెట్ పరిస్థితులు, డిమాండ్, కొత్త రహదారులు, కారిడార్లు, ఔటర్ రింగ్ రోడ్ (ORR), రీజినల్ రింగ్ రోడ్ (RRR), పారిశ్రామికాభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని మార్కెట్ విలువలను నిర్ణయించినట్లు వివరించారు.

అలాగే, ఫ్లాట్ల అన్ని అంతస్తులకు ఒకే రేటు వర్తింపజేస్తూ మార్కెట్ విలువలను హేతుబద్ధీకరించినట్లు వివరించారు. ఇప్పటికే అధిక మార్కెట్ విలువలు ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి పెంపు ప్రతిపాదించలేదని స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రాంతాల అభివృద్ధి స్థాయిని బట్టి వ్యవసాయ భూములు, ప్లాట్లు, ఫ్లాట్లకు కనీస ప్రాథమిక ధరలను కూడా నిర్ణయించినట్లు తెలిపారు.

గత ఐదేళ్లలో నిర్మాణ సామగ్రి ధరలు, కార్మికుల వేతనాలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో నిర్మాణ ధరలను సవరించినట్టు మంత్రి పేర్కొన్నారు. పలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లుగా అప్‌గ్రేడ్ కావడం, గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఆర్‌సీసీ, నాన్-ఆర్‌సీసీ నిర్మాణాల ధరలను గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సవరించినట్లు వెల్లడించారు.

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఈ సవరణలు చేపట్టామని మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, భూ లావాదేవీలలో పారదర్శకతకు, ప్రభుత్వ ఆదాయ వృద్ధికి ఈ నిర్ణయం దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam