2027 ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్‌కు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికీ, టీమిండియా జట్టు కాంబినేషన్‌పై ఇప్పుడే చర్చలు మొదలయ్యాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే మరియు నమీబియా దేశాలు 2027 అక్టోబర్ 4 నుండి నవంబర్ 21 వరకు ఈ టోర్నీకి సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
ఈ నేపథ్యంలో భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. 2027 వన్డే ప్రపంచకప్ కోసం తన డ్రీమ్ జట్టును ప్రకటించాడు.
ఓ వీడియోలో మాట్లాడిన రవిచంద్రన్ అశ్విన్.. ఆటగాళ్లను మూడు కేటగిరీల్లో విభజించాడు. 'ఎస్ (ఖచ్చితంగా జట్టులో ఉండేవారు)', 'మేబీ (బహుశా చోటు దక్కొచ్చు)', 'నో (చోటు దక్కదు)' అనే మూడు కేటగిరీల్లో ఆటగాళ్ల పేర్లు వెల్లడించాడు.
అశ్విన్ 'ఎస్' కేటగిరీలోని ఆటగాళ్లు..
శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, భువనేశ్వర్ కుమార్.
మేబీ (బహుశా చోటు దక్కొచ్చు) కేటగిరీలోని ఆటగాళ్లు..
యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్, వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ.
నో (చోటు దక్కదు) కేటగిరీలోని ఆటగాళ్లు..
రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, సంజు శాంసన్, వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, రవి బిష్ణోయ్, శివమ్ దూబే, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్.
కాగా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను ఈ టోర్నీలో ఆడించాలని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. అందుకోసం ప్రపంచ కప్‌కు ముందు అతనికి క్రమం తప్పకుండా ఆడే అవకాశం ఇవ్వాలని సూచించాడు. "నేనే సెలక్టర్ అయితే.. భువనేశ్వర్ కుమార్‌ను తప్పకుండా ఎంపిక చేస్తాను. నేను అతడితో మాట్లాడతాను. అతడిని అన్ని టోర్నమెంట్‌లు, ఫస్ట్-క్లాస్, విజయ్ హజారే, అన్నీ ఆడేలా చేసి, దక్షిణాఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధం చేస్తాను. అక్కడ అతడు భారత జట్టుకు అవసరమని నేను నమ్ముతున్నా" అని అశ్విన్ వ్యాఖ్యానించాడు. కాగా భువీ.. ఆర్సీబీ.. వరుసగా రెండు ఐపీఎల్ టైటిల్స్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. గత సీజన్‌లో 16 మ్యాచ్‌లలో 28 వికెట్లు తీశాడు. 17.89 సగటు, 7.95 ఎకానమీ రేటుతో టోర్నమెంట్‌లో రెండో అత్యధిక వికెట్ టేకర్‌గా నిలిచాడు.

