Dailyhunt
బిగ్ అలర్ట్.. ఆ జిల్లాలలో పిడుగులతో భారీ వర్షం.. విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక

బిగ్ అలర్ట్.. ఆ జిల్లాలలో పిడుగులతో భారీ వర్షం.. విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక

Telugu Samayam 2 weeks ago

ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాలలో శుక్రవారం సాయంత్రం పిడుగులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వచ్చే మూడు గంటలలో అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ శుక్రవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ప్రకటన విడుదల చేసింది.

అలాగే పార్వతీపురం మన్యం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి జల్లులు కురిసేందుకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ నేపథ్యంలో పిడుగులు పడే సమయంలో పొలాల్లో పని చేసే వ్యక్తులు, పశువుల కాపరులు, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

మరోవైపు కొన్ని జిల్లాలలో వర్షాలు కురుస్తున్నప్పటికీ.. మరికొన్ని చోట్ల మాత్రం భానుడి ప్రతాపం కొనసాగుతోంది. శుక్రవారం రోజున రాష్ట్రంలోని 11 జిల్లాలలో పగటి పూట ఉష్ణోగ్రతలు 40 డీగ్రీలకు పైగా నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అత్యధికంగా పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో 41.8°డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత చిత్తూరు జిల్లా రాయలపేటలో 41.4, అనకాపల్లి జిల్లా నాతవరంలో 40.9 డిగ్రీలో చొప్పున నమోదైంది. అలాగే శ్రీకాకుళం జిల్లా జి. సిగడాంలో 40.5 డిగ్రీలు, నంద్యాల జిల్లా ఆలమూరు, కడప జిల్లా బద్వేల్ లో 40.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఎండలు అధికంగా ఉన్న ప్రాంతాలలో డీహైడ్రేషన్‌కు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తలకు టోపీలు, తలపాగాలు ధరించాలని.. మంచి నీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించింది.

వీలైనంత వరకూ వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలని.. ప్రజలకు సూచించింది. ఇక పిడుగులతో కూడిన వర్షాలు పడేచోట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని.. ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద నిలబడవద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.విద్యుత్ పరికరాలు, కరెంట్ పోళ్లకు దూరంగా ఉండాలని సూచించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam