Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Bihar: విద్యార్థుల మార్క్‌షీట్‌లో ఇక " ఫెయిల్" అనేది ఉండదు.. ప్రభుత్వం నిర్ణయం

Bihar: విద్యార్థుల మార్క్‌షీట్‌లో ఇక " ఫెయిల్" అనేది ఉండదు.. ప్రభుత్వం నిర్ణయం

Telugu Samayam 2 weeks ago

విద్యార్థుల కోసం బిహార్ ప్రభుత్వం ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది. పది, పన్నెండో తరగతి పరీక్షల మార్క్ షీట్‌లలో ఫెయిల్ అనే పదానికి చోటే లేకుండా చేసింది.

ఇకపై ఫెయిల్ అనే పదం స్థానంలో ఎలిజబుల్ ఫర్ స్కిల్ ట్రైనింగ్ అనే పదాన్ని ఉపయోగించనున్నారు. ఈ మేరకు బిహార్ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో బిహార్ విద్యాశాఖ మంత్రి మిథిలేష్ తివారీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నిర్ణయం మేరకు నిబంధనలు సడలిస్తామని.. బిహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు అవసరమైన సూచనలు జారీ చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా బిహార్ విద్యాశాఖ మంత్రి మిథిలేష్ తివారీ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఓ పరీక్షలో అనుకున్న మేరకు మార్కులు సాధించలేకపోవటమనేది.. ఆ విద్యార్థి ప్రతిభకు నిదర్శనం కాకూడదని మంత్రి అభిప్రాయపడ్డారు. విద్యార్థిలో ఆత్మవిశ్వాసాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ధ్రువపత్రాలలో ఫెయిల్ అనే పదాన్ని ఉపయోగించకూడదని నిర్ణయించినట్లు వెల్లడించారు. అలాగే మెట్రిక్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలనే ఆలోచనలో బిహార్ విద్యాశాఖ ఉంది. నెలరోజుల పాటు ఈ స్పెషల్ క్లాసులు నిర్వహించడం ద్వారా వారికి అదనపు ప్రిపరేషన్ అందించి, పరీక్షలు క్లియర్ చేసేలా చూడాలనేది తమ ఉద్దేశమని అధికారులు వెల్లడించారు.

మరోవైపు విద్యార్థుల కోసం బిహార్ విద్యాశాఖ పలు సంస్కరణలు తీసుకువస్తోంది. పాఠశాల విద్యావ్యవస్థలో పలు కీలక మార్పులు తీసుకువచ్చింది. సంప్రదాయ తరగతి గది బోధనలు కాకుండా కొత్త కార్యక్రమాలు చేపడుతోంది. ప్రతి శనివారం ప్రభుత్వ పాఠశాలలు తక్కువ సమయం మాత్రమే పనిచేయాలని.. నోబ్యాగ్ డే పాటించాలని ఇటీవల నిర్ణయించారు. ఈ నిర్ణయం ప్రకారం ప్రతీ శనివారం బిహార్‌లోని ప్రభుత్వ పాఠశాలలు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ మాత్రమే పనిచేస్తాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకూ ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ పనిచేస్తాయి.

అలాగే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5న 'టీచర్ సపోర్ట్ పోర్టల్'ను బిహార్ ప్రభుత్వం ప్రారంభించనుంది. 9వ తరగతి నుంచి 12 వ తరగతి విద్యార్థుల కోసం 'విద్యా సాథి' యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ సహాయంతో విద్యార్థులు.. 24 గంటలూ ఉపాధ్యాయుల నుంచి ఆన్‌లైన్ ద్వారా విద్యా సహాయం పొందవచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam