Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బీసీసీఐ గుడ్‌న్యూస్.. విశాఖలో రో-కో మ్యాచ్.. ఇదే చివరిసారి అవుతుందా!

బీసీసీఐ గుడ్‌న్యూస్.. విశాఖలో రో-కో మ్యాచ్.. ఇదే చివరిసారి అవుతుందా!

Telugu Samayam 1 day ago

ఈ ఏడాది డిసెంబర్‌లో శ్రీలంక జట్టు భారతదేశ పర్యటనకు రానుండగా, ఇరు జట్ల మధ్య జరగాల్సిన తొలి వన్డే మ్యాచ్ వేదికలో బీసీసీఐ మార్పులు చేసింది. డిసెంబర్ 13న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగాల్సిన సిరీస్ ఆరంభ మ్యాచ్‌ను విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి మారుస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి గురువారం అధికారికంగా ప్రకటించింది.

ఈ నిర్ణయం పట్ల తెలుగు రాష్ట్రాల్లోని క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) విజ్ఞప్తి మేరకు బీసీసీఐ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ప్రస్తుతం అరుణ్ జైట్లీ స్టేడియంలో భారీ ఎత్తున పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. దానికితోడు డిసెంబర్ నెలలో ఢిల్లీని చుట్టుముట్టే మంచు ప్రభావం, పొగమంచు వల్ల మ్యాచ్ నిర్వహణకు అంతరాయం కలిగే ప్రమాదం ఉండటంతో పర్ఫెక్ట్‌గా మ్యాచ్ నిర్వహించడం కష్టమని డీడీసీఏ భావించింది. దీంతో ప్రత్యామ్నాయ వేదికగా విశాఖను ప్రతిపాదించగా బీసీసీఐ తక్షణమే దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

శ్రీలంక భారత పర్యటనలో భాగంగా మొత్తం 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ ఆడనుంది. మొదటి వన్డే మాత్రమే విశాఖపట్నంకు మారగా, మిగిలిన ఐదు మ్యాచ్‌ల వేదికల్లో ఎలాంటి మార్పులు లేవు. వన్డే సిరీస్ డిసెంబర్ 13న వైజాగ్ మ్యాచ్‌తో ఆరంభమై డిసెంబర్ 19న అహ్మదాబాద్‌లో ముగుస్తుంది. ఆ తర్వాత పొట్టి ఫార్మాట్ టీ20 సిరీస్ డిసెంబర్ 22న రాజ్‌కోట్ వేదికగా ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు వన్డే మ్యాచ్‌లు, రాత్రి 7 గంటలకు టీ20 పోరు ప్రారంభమవుతాయి.

ఆంధ్రప్రదేశ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో కూడిన భారత జట్టు మ్యాచ్ ఆడబోతుండటంతో వైజాగ్ నగరంలో ఇప్పుడే క్రికెట్ ఫీవర్ మొదలైంది. గతంలో కూడా విశాఖ స్టేడియం భారత్‌కు ఎన్నో గుర్తుండిపోయే విజయాలను అందించింది. ముఖ్యంగా కోహ్లీ, రోహిత్‌లకు వైజాగ్ గ్రౌండ్‌పై అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. డిసెంబర్ 13న జరగనున్న ఈ తొలి వన్డే సమరంలో లంకపై భారత ఆటగాళ్లు ఆధిపత్యం చెలాయించాలని అభిమానులు ఆశిస్తున్నారు.

కాగా రో-కో ప్రస్తుతం టెస్ట్, టీ20లకు వీడ్కోలు పలికి, వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. వన్డే ప్రపంచకప్ 2027 తర్వాత వీరు.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశం ఉంది. దీంతో వీరిద్దరూ విశాఖ వేదికగా కలిసి వన్డే మ్యాచ్ ఆడటం ఇదే చివరిసారి అవుతుందేమో.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam