నిషాంత్ దోటి దర్శకత్వంలో కుమార్ కాసారం, శ్వేతా లక్ష్మణ్, వ్రజన పాండ్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా 'సహ: లైఫ్ ఆఫ్ సంజు'. సెప్టెంబర్ 4న ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ప్రమోషన్స్ లో భాగంగా గురువారం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి బన్నీ వాసు, వంశీ నందిపాటి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఈ సినిమా ఎవరినీ డిజప్పాయింట్ చేయదని, ఒకవేళ నిరాశ పరిస్తే తాను అమీర్ పేట్ సెంటర్ లో గుండు కొట్టించుకుంటానని ఛాలెంజ్ చేసి చెప్పింది. దీనిపై బన్నీ వాసు స్పందిస్తూ సరదా వ్యాఖ్యలు చేశారు.
బన్నీ వాసు మాట్లాడుతూ.. ''ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీకి కొత్తగా వచ్చేవాళ్లు స్టేజ్ మీద మాట్లాడేవి చూస్తున్నాను. మా జనరేషన్ లో చాలా ఒదిగి ఉండేవాళ్లం. స్టేజ్ ఎక్కినప్పుడు పెద్దలను గౌరవిస్తూ మాట్లాడేవాళ్లం. ఇప్పుడు జనరేషన్ అంతా జెన్ జీ. కొట్టామా తెచ్చామా అన్నట్టు ఉంటున్నారు. సినిమాపై అంత కాన్ఫిడెంట్ గా ఉన్నందుకు 'సహ' టీమ్ ను అప్రిసియేట్ చేయాలి. పోస్టర్ మీద 'ది బిగ్గెస్ట్ స్మాల్ ఫిల్మ్ ఆఫ్ ది డికేడ్' అని వేశారు. కంటెంట్ మీద నమ్మకంతోనే ఇది వేశారు. కానీ మీరు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. రేపొద్దున ఇది ఓవర్ కాన్ఫిడెంట్ కాకూడదని కోరుకుంటున్నాను'' అని నవ్వుతూ అన్నారు.
''నేను ఈ సినిమా చూశాను. కంటెంట్ బాగుంది. ఒక సినిమా హిట్టవ్వడానికి, డబ్బులు రావడానికి కంటెంట్ తో పాటుగా చాలా ఫ్యాక్టర్స్ కలిసిరావాలి. అది మన చేతుల్లో ఉండదు. మంచి కంటెంట్ ఉన్న సినిమాకి నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. కంటెంట్‌లో ఎంతో కొంత మ్యాటర్ ఉంటేనే నేను ముందుకు వచ్చి మాట్లాడతాను. ఏ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందనేది జడ్జి చేయడానికి మనమేమీ దేవుళ్లం కాదు. 'బాగుంది.. బాగాలేదు.. పనికిరాదు' అని మాత్రమే మనం చెప్పగలం. డెఫినిట్ గా 'సహ' సినిమా బాగుంది. దీనికి అన్ని ఫ్యాక్టర్స్ కలిసి వచ్చిన తర్వాత ఫస్ట్ వీక్ లో ఈ పోస్టర్ పడుంటే బాగుండు. కానీ వీళ్లు జెన్ జీ కదా.. ముందే పోస్టర్ మీద వేసేశారు. వీళ్ల కాన్ఫిడెన్స్ నిజం అవ్వాలని కోరుకుంటున్నాను'' అని బన్నీ వాసు అన్నారు.
శ్వేతా లక్ష్మణ్ చేసిన ఛాలెంజ్‌ను పక్కన పెట్టేస్తున్నానని బన్నీ వాసు తెలిపారు. ''శ్వేతా ఎమోషన్స్ నేను అర్థం చేసుకోగలను. కానీ రిలీజుకు ముందు బ్యాలన్స్ గా ఉండటం అవసరం. మున్ముందు చాలా భవిష్యత్ ఉన్న అమ్మాయి. సినిమాలో చాలా బాగా నటించింది. సినిమాల విషయంలో అన్నీ మనం అనుకున్నట్టు, ఊహించుకున్నట్టు ఉండవు. ఇది మంచి సినిమా. అందులో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఒక సినిమా విజయానికి చాలా ఫ్యాక్టర్స్ కలిసి రావాలి కాబట్టి, అందరూ కొంచం ఓపికగా ఉండండి. సినిమా రిలీజయ్యాక ఛాలెంజులు చేసి, తొడలు కొట్టొచ్చు. మేము అలా తొడలు కొట్టీ కొట్టీ, మా తొడలు వాసిపోయాయి. ప్లాస్టిక్ సర్జరీలు చేసుకొని తిరుగుతున్నాం'' అని బన్నీ వాసు నవ్వుతూనే చిత్ర బృందాన్ని హెచ్చరించారు.
''టీమ్ అందరూ కష్టపడి చాలా మంచి సినిమా తీశారు. ఈ సినిమా నిర్మాత కొత్త వాళ్లని ఎంకరేజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా అలాంటి నిర్మాత తీస్తున్న సినిమా గురించి మాట్లాడాలని వచ్చాను. అలాగే ఈ సినిమా కంటెంట్ కూడా చాలా బాగుంది. అలాంటి కంటెంట్ థియేటర్లలోకి వస్తే.. ఖచ్చితంగా ఈ సినిమాకి మంచి ప్రశంసలు వస్తాయని నమ్ముతున్నాను. అందుకే నేను సపోర్ట్ చేస్తున్నాను. డైరెక్టర్ చాలా మంచి కంటెంట్ రాసుకున్నాడు. అంతే బాగా తీశాడు. నిజానికి ఈ సినిమా చాలా కాంపిటీషన్‌లో వస్తుంది. కాకపోతే ధైర్యంతో, కంటెంట్ మీద నమ్మకంతో వస్తున్నారు. నేనైతే ఈ ధైర్యం చేసేవాడిని కాదు. వీళ్లందరి ధైర్యం, నమ్మకం నిజం అవ్వాలని.. అందరూ వీళ్ల కష్టం గురించి మాట్లాడుకోవాలని కోరుకుంటున్నాను'' అని బన్నీ వాసు చెప్పుకొచ్చారు.
ఇక ఇదే ఈవెంట్ లో యాంకర్ స్రవంతి చొక్కారపు, వంశీ నందిపాటి, బన్నీ వాసు మధ్య సరదా సంభాషణ జరిగింది. 'మీ స్మైల్ బాగుంది' అని మొదటిసారి ఎవరికి చెప్పారు? అని స్రవంతి ప్రశ్నించగా.. ''నేను దానికి సమాధానం చెప్తే వల్ల ఇద్దరి కాపురాలు చెడిపోతాయి. ఇప్పుడు అవసరమా?. నా కాపురం చెడిపోద్ది.. నేను చెప్పేవాళ్లది చెడిపోద్ది'' అంటూ బన్నీ వాసు నవ్వుతూ బదులిచ్చారు.

