Dailyhunt
చంద్రబాబు ఇలాకాలో ఎయిర్‌పోర్టు.. కుప్పం విమానాశ్రయానికి గ్రీన్‌సిగ్నల్.. సుప్రీం కీలక తీర్పు

చంద్రబాబు ఇలాకాలో ఎయిర్‌పోర్టు.. కుప్పం విమానాశ్రయానికి గ్రీన్‌సిగ్నల్.. సుప్రీం కీలక తీర్పు

Telugu Samayam 2 weeks ago

చిత్తూరు జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ తలపెట్టిన కుప్పం ఎయిర్‌పోర్టుకు ఆదిలోనే హంస పాదు ఎదురైన సంగతి తెలిసిందే. విమానాశ్రయం నిర్మాణంలో కీలకమైన భూసేకరణ ప్రక్రియకు న్యాయపరమైన చిక్కులు వచ్చాయి.

ఈ వివాదం కాస్తా.. సుప్రీంకోర్టుకు ఎక్కగా.. తాజాగా బిగ్ రిలీఫ్ లభించింది. కుప్పం విమానాశ్రయ ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించిన న్యాయపరమైన వివాదాలకు ముగింపు పలుకుతూ సుప్రీంకోర్టు తాజాగా కీలక తీర్పును వెలువరించింది. కుప్పం ఎయిర్‌పోర్టు కోసం చేపట్టిన భూసేకరణను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది. దీంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఇచ్చిన తీర్పులో తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

కుప్పం ఎయిర్‌పోర్టుకు సంబంధించి 150 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్లపై తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది. పిటిషనర్లు ప్రజా ప్రయోజనం ఉందని స్పష్టంగా నిరూపించలేదని లాయర్ వాదించారు. దీనికి అభ్యంతరం చెప్పే అవకాశం తమకు ఏపీ హైకోర్టులో ఇవ్వలేదని జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం దృష్టికి లాయర్లు తీసుకెళ్లారు.

ఈ కుప్పం ఎయిర్‌పోర్టు ప్రాజెక్ట్ కోసం సుమారు 150 ఎకరాల భూమిని సేకరించేందుకు చిత్తూరు జిల్లా కలెక్టర్ ఇప్పటికే జారీ చేసిన 4 నోటిఫికేషన్లు చట్టబద్ధమేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. భూసేకరణకు అనుకూలతపై సరైన ఆధారాలు లేవంటూ చక్రపాణి రెడ్డి సహా ఇతర పిటిషనర్లు చేసిన వాదనలను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా ఈ కుప్పం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఇతర పిటిషన్లు కూడా ముగిసినట్లు సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీంతో కుప్పం విమానాశ్రయం ప్రాజెక్టుకు న్యాయపరంగా ఉన్న అన్ని అడ్డంకులు పూర్తిగా తొలగిపోయినట్లయింది.

సుప్రీంకోర్టు తీర్పుతో కుప్పం ఎయిర్‌పోర్టు పనులు త్వరలోనే వేగం పుంజుకోనున్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. దీంతో కుప్పం ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధితోపాటు.. రవాణా సౌకర్యాలు మెరుగుపడటం.. కొత్త పెట్టుబడులు ఆకర్షించడం.. వీటన్నింటితో అక్కడి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొంటున్నాయి. ఇక కుప్పం విమానాశ్రయం నిర్మాణం పూర్తి అయితే దక్షిణ ఆంధ్రప్రదేశ్‌కు మెరుగైన ఎయిర్ కనెక్టివిటీతోపాటు.. సమీప ప్రాంతాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడంతోపాటు.. టూరిజం అభివృద్ధి జరగనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam