Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చంద్రబాబు కీలక నిర్ణయం.. తంబళ్లపల్లె టీడీపీ ఇంఛార్జ్‌గా శంకర్ యాదవ్

చంద్రబాబు కీలక నిర్ణయం.. తంబళ్లపల్లె టీడీపీ ఇంఛార్జ్‌గా శంకర్ యాదవ్

Telugu Samayam 2 weeks ago

తెలుగుదేశం పార్టీ మరో నియోజకవర్గానికి కొత్త ఇంఛార్జ్‌ను నియమించింది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే జి శంకర్‌ యాదవ్‌కు బాధ్యతలు అప్పగించారు.

తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ బాధ్యతలు శంకర్ యాదవ్‌కు అప్పగించినట్లు ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. దాదాపు పది నెలల తర్వాత తంబళ్లపల్లె నియోజకవర్గానికి ఇంఛార్జ్‌ను నియమించారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ అధిష్టానం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. తనకు మరోసారి తంబళ్లపల్లె నియోజకవర్గ ఇంఛార్జ్‌గా బాధ్యతలు అప్పగించినందుకు శంకర్ యాదవ్ అధినేత చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.

శంకర్ యాదవ్ సొంత ఊరు అన్నమయ్య జిల్లా పీటీఎం మండలం టి సదుం.. ఆయన 2009లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీలో చేరి 2014 ఎన్నికల్లో తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున మరోసారి పోటీచేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించినా ఆయనకు అవకాశం దక్కలేదు. ఎన్నికలకు ఆరు నెలల ముందు టీడీపీలో చేరిన దాసరిపల్లె జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చారు.. కానీ ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత జయచంద్రారెడ్డి నియోజకవర్గ ఇంఛార్జ్‌గా కొనసాగారు.. శంకర్ యాదవ్ కూడా నియోజకవర్గంలో కార్యక్రమాలు కొనసాగించారు.

గతేడాది అక్టోబర్‌లో బయటపడిన ములకలచెరువు నకిలీ మద్యం కేసులో జయచంద్రారెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు.. అప్పటి నుంచి తంబళ్లపల్లె నియోజకవర్గానికి ఇంఛార్జ్ లేకుండా పోయారు. అనంతరం పరిణామాలు మారిపోయాయి.. కొత్త ఇంఛార్జ్ ఎంపికపై టీడీపీ అధిష్టానం తంబళ్లపల్లె నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించింది. ఇంఛార్జ్‌గా ఎవరిని నియమించాలనే అంశంపై చర్చలు జరిగిన నిర్ణయం మాత్రం వాయిదా పడుతూనే వస్తోంది. జయచంద్రారెడ్డి సతీమణి కల్పనారెడ్డితో పాటు అంగళ్లకు చెందిన సురేంద్ర యాదవ్‌లు ఇంఛార్జ్ పదవి కోసం గట్టిగా ప్రయత్నాలు చేశారు. ఈ సమావేశాల్లో జయచంద్రారెడ్డి, శంకర్ యాదవ్ వర్గీయుల మధ్య వివాదాలు కూడా నడిచాయి.

గత నెలలో టీడీపీ అధిష్ఠానం తిరుపతిలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, పార్టీ జోనల్‌ ఇన్‌ఛార్జి దామచర్ల సత్య, అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌బాబులతో కలిసి అభిప్రాయ సేకరణ చేపట్టారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత సామాజిక సమీకరణాలు, శంకర్‌ యాదవ్‌కున్న సీనియారిటీ వంటి అంశాలనుపరిగణనలోకి తీసుకున్నారు. దీనికి తోడు స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలు కావడంతో టీడీపీ అధిష్టానం శంకర్ యాదవ్‌కే తంబళ్లపల్లె నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతల్ని అప్పగించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam