తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంపై మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు. మహానాడులో టీడీపీ నేతలు ఉపయోగించిన భాష, వారి బాడీ లాంగ్వేజ్ చూస్తే అసహ్యమేసిందన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాలి గోటికి సరిపోని వారు కూడా మహానాడులో ఇష్టానుసారం మాట్లాడుతున్నారని.. అది సైకిల్ పార్టీ మహానాడా లేక సైకో పార్టీ మహానాడా అంటూ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా మహానాడు పట్టించుకోలేదని రోజా విమర్శించారు. చంద్రబాబుది మహానాడు కాదు.. దగానాడు అని ప్రజలకు తెలిసిందన్న రోజా.. మహానాడులో జగన్ నామస్మరణే ఎక్కువగా కనిపించిందన్నారు. జగన్ పేరు వింటేనే టీడీపీ నేతల వెన్నులో వణుకు పుడుతోందన్నారు రోజా. రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేసి మరీ మహానాడు సభలకు జనాల్ని రప్పించే ప్రయత్నం చేసారని విమర్సించారు.
మరోవైపు ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని రోజా ఆరోపించారు. ప్రశ్నించేవారిపై కేసులు పెడుతున్నారని.. దేశంలోని ర్యాంకులలో ఏపీ పోలీసులు చివరి స్థానంలోకి వెళ్లారని విమర్శించారు. మహానాడులో జగన్ గురించి, వైసీపీ గురించి నీచంగా మాట్లాడుతున్నారని.. గొడ్డలి పార్టీ అంటున్నారని మండిపడ్డారు. వెన్నుపోటు, మోసాలతో చంద్రబాబు ముఖ్యమంత్రి స్థాయికి చేరితే.. జగన్ సొంతంగా ఎదిగారన్నారు. జగనన్న చెల్లికి ఇచ్చిన ఆస్తిని.. ప్రపంచంలో ఏ అన్నా, తన చెల్లికి ఇచ్చి ఉండరని రోజా అభిప్రాయపడ్డారు. హెరిటేజ్ ఆస్తులలో చంద్రబాబు తల్లికి, చెల్లికి ఇచ్చిన వాటా ఎంతో చెప్తారా అని ప్రశ్నించారు. వైఎస్ వివేకా హత్య చంద్రబాబు హయాంలో జరిగిందన్న రోజా.. వైఎస్ షర్మిల, సునీత అప్పుడు ఎందుకు మాట్లాడలేదని విమర్శించారు.
వివేకా హత్య కేసులో నిందితుడు దస్తగిరికి కొమ్ము కాస్తోది మీరు కాదా అని ప్రశ్నించారు. ఇదే క్రమంలో హోం మంత్రి వంగలపూడి అనితపైనా విమర్శలు గుప్పించారు. సుగాలి ప్రీతి పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చారని.. ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారన్న రోజా.. కూటమి సర్కారు మోసాలను వెన్నుపోటు రెండేళ్లు పేరుతో విడుదల చేసిన బుక్ లెట్ ద్వారా రాష్ట్రంలోని ప్రతి గడపకూ చేరేలా చూస్తామని స్పష్టం చేశారు.

