Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చెవిలో పురుగు దూరిందా? కంగారు పడకుండా పాటించాల్సిన డాక్టర్ చిట్కాలు!

చెవిలో పురుగు దూరిందా? కంగారు పడకుండా పాటించాల్సిన డాక్టర్ చిట్కాలు!

Telugu Samayam 16 hrs ago

కొన్నిసార్లు ఈగ లేదా కీటకం చెవిలోకి ప్రవేశిస్తుంది. ఇది చాలా అరుదు అయినప్పటికీ, ఒక పురుగు చెవిలోకి ప్రవేశించి కొంతకాలం అక్కడే ఉండగలదు. చెవిలోంచి కీటకాన్ని తొలగించడానికి అనేక మార్గాలు ఉన్నాయి.

కానీ దీనికి వైద్యుని సలహా అవసరం కావచ్చు. కొందరికి నిద్రపోతున్న సమయంలో పురుగు దూరొచ్చు. మరికొందరికి నడుస్తున్నప్పుడు పురుగు ఎగిరి చెవిలోకి రావచ్చు. చెవిలో పురుగు దూరితే ఏం చేయాలి, ఏం చేయకూడదో డాక్టర్ ద్వారా తెలుసుకుందాం.


వర్షాకాలం ప్రారంభంలో కీటకాలు, పురుగులు ఇంట్లోకి ఎక్కువగా వస్తుంటాయి. తరచుగా దోమలు, ఈగలు లేదా చిన్న బొద్దింకలు వంటి ఈ కీటకాలు చెవిలోకి ప్రవేశిస్తాయి, దీనివల్ల చాలా మంది కంగారుపడి, వాటిని ఎలా తొలగించాలో తెలియక సతమతమవుతారు. ఈ కంగారులో చాలా మంది అగ్గిపుల్లలు, ట్వీజర్లు, ప్లక్కర్ల వంటి వస్తువుల్ని తమ చెవుల్లోకి చొప్పించడం ప్రారంభిస్తారు. ఇది చెవి పొరను దెబ్బతీస్తుంది. ఇలా ఎప్పుడూ చేయకూడదు.

చెవిలో పురుగు దూరినప్పుడు లోపల అది కదలడం, గీరడం లేదా నొప్పి రావడం వల్ల తీవ్రమైన అసౌకర్యం కలుగుతుంది. కానీ మొదటి రూల్: అస్సలు కంగారు పడకండి. మీరు ఎంత కంగారుపడితే, ఆ కదలికల వల్ల పురుగు మరింత లోపలికి వెళ్లే అవకాశం ఉందని డాక్టర్ ప్రత్యూష ఎస్ (కన్సల్టెంట్ - ENT, గ్లెనీగల్స్ అవేర్ హాస్పిటల్ (ఫోర్టిస్ హెల్త్‌కేర్ నెట్‌వర్క్ హాస్పిటల్) ఎల్బీ నగర్, హైదరాబాద్) హెచ్చరించారు. చెవిలోకి పురుగు దూరితే ఏం చేయాలి, ఏం చేయకూడదో డాక్టర్ వివరించారు.వెంటనే చేయాల్సిన పనులు
  1. ​చెవిలో ఏ వస్తువులూ పెట్టకండి: వేళ్లు, కాటన్ బడ్స్ (ఇయర్ బడ్స్), లేదా ట్వీజర్స్ (చిన్న పటకారు) వంటివి అస్సలు వాడకండి. వీటివల్ల పురుగు ఇంకా లోపలికి వెళ్లడమే కాకుండా, చెవి కర్ణభేరి దెబ్బతినే ప్రమాదం ఉంది.
  2. గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించండి: పురుగు దూరిన చెవి పైకి ఉండేలా తలను పక్కకు తిప్పి ఒక నిమిషం ఆగండి. కొన్నిసార్లు పురుగు దానంతట అదే బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోతే, ఆ చెవి కిందికి ఉండేలా తల తిప్పి, నెమ్మదిగా తలను కదల్చండి (ఊపండి).
  3. పురుగు బతికే ఉంటే 'ఆయిల్' వాడండి: లోపల శబ్దం వస్తున్నా, కదులుతున్నట్లు అనిపించినా పురుగు బతికే ఉన్నట్లు లెక్క. అలాంటప్పుడు తలను పక్కకు వంచి, గోరువెచ్చని మినరల్ ఆయిల్, బేబీ ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్ (లేదా వంట నూనె) 3-4 చుక్కలు చెవిలో వేయండి. దీనివల్ల పురుగుకి ఊపిరాడక కదలికలు ఆగిపోతాయి, నొప్పి తగ్గుతుంది. ఒకటి రెండు నిమిషాలు ఆగాక, తలను కిందికి వంచితే నూనెతో పాటు పురుగు బయటకు వచ్చేస్తుంది.(గమనిక: మీకు గతంలో ఎప్పుడైనా కర్ణభేరికి రంధ్రం పడినా, చెవి ఆపరేషన్ అయినా, లేదా చెవిలో ట్యూబ్స్ ఉన్నా ఈ ఆయిల్ అస్సలు వేయకూడదు).
  4. పురుగు చనిపోతే గోరువెచ్చని నీటితో కడగండి: కదలికలు ఆగిపోయి, పురుగు ఇంకా లోపలే ఉండిపోతే... ఒక శుభ్రమైన సిరంజి (Bulb Syringe) సాయంతో గోరువెచ్చని నీటిని చెవిలోకి నెమ్మదిగా పంపి ఫ్లష్ చేయండి. నీటిని మరీ ఫోర్స్‌గా కొట్టకూడదు.

అస్సలు చేయకూడని పనులు
  • చెవి నుంచి రక్తం, చీము లేదా ఏదైనా ద్రవం కారుతున్నా, అప్పటికే తీవ్రమైన నొప్పి ఉన్నా, హఠాత్తుగా వినికిడి తగ్గినట్లు అనిపించినా చెవిలో ఎలాంటి నూనెలు, నీళ్లు పోయకూడదు.
  • చెవిపై గట్టిగా కొట్టుకోవడం, తలను గట్టిగా బాదుకోవడం చేయొద్దు.

వెంటనే డాక్టర్‌ని ఎప్పుడు కలవాలి?
  • ​పైన చెప్పిన వాటి వల్ల పురుగు బయటకు రానప్పుడు.
  • తీవ్రమైన నొప్పి, వాపు, రక్తం రావడం లేదా వినికిడి లోపం అనిపించినప్పుడు.
  • మీ కర్ణభేరి బాగుందో లేదో అన్న నమ్మకం లేనప్పుడు.
  • ENT నిపుణులు మైక్రోస్కోప్, సక్షన్ (Suction) లేదా చిన్న పరికరాల సాయంతో కేవలం 2-3 నిమిషాల్లో ఎలాంటి నొప్పి లేకుండా సురక్షితంగా పురుగును తీసేస్తారు. దీనికి అస్సలు సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఇలా జరగడం చాలా సహజం.

ముఖ్యమైన విషయాలు
  1. ​చీమలు దూరితే: చెవిలో చీమలు వెళ్లినప్పుడు అవి కుట్టకుండా ఉండటానికి పైన చెప్పినట్లు వెంటనే రెండు చుక్కలు నూనె వేయడం ఉత్తమ మార్గం.
  2. కెమికల్స్ వాడకండి: కొందరు పురుగు చావాలని డెటాల్, శానిటైజర్ లేదా ఆల్కహాల్ వంటివి చెవిలో పోస్తుంటారు. ఇవి చెవి లోపలి సున్నితమైన చర్మాన్ని, కర్ణభేరిని పూర్తిగా పాడుచేస్తాయి. కాబట్టి వీటిని అస్సలు వాడకూడదు.
  3. నిద్రించేటప్పుడు జాగ్రత్త: నేలపై పడుకునే అలవాటు ఉన్నవారు లేదా తోటల్లో, చెట్ల కింద పడుకునేటప్పుడు చెవుల్లో చిన్న దూది (Cotton) పెట్టుకోవడం లేదా చెవుల్ని కప్పేలా క్లాత్ కట్టుకోవడం వల్ల ఇలాంటి ప్రమాదాల్ని నివారించవచ్చు.

సమయం తెలుగు సంప్రదించిన వైద్య నిపుణులు
​డాక్టర్ ప్రత్యూష .S​

కన్సల్టెంట్ - ENT (ముక్కు, చెవి, గొంతు నిపుణులు)
గ్లెనెగల్స్ అవేర్ హాస్పిటల్ (ఫోర్టిస్ హెల్త్‌కేర్ నెట్‌వర్క్), ఎల్బీ నగర్, హైదరాబాద్.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam