భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) సీనియర్ పురుషుల సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా అజిత్ అగార్కర్ బాధ్యతలు అధికారికంగా ముగిశాయి. జులై 2023లో చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అగార్కర్ కాంట్రాక్ట్ అక్టోబర్ 4తో పూర్తి కావడంతో, ఆయన పదవి నుంచి తప్పుకున్నారు.
బుధవారం సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. ఇటీవల జరిగిన న్యూజిలాండ్ టీ20 సిరీస్ జట్టు ఎంపిక సమావేశంలో అగార్కర్ హాజరుకాకపోగా, ప్రజ్ఞాన్ ఓజా తాత్కాలికంగా ఆ సమావేశానికి సారథ్యం వహించాడు.
మూడేళ్లలో 3 ఐసీసీ ట్రోఫీలు, మరచిపోలేని విజయాలు!
అగార్కర్ హయాం భారత క్రికెట్ చరిత్రలోనే ఒక స్వర్ణయుగంగా నిలిచిపోతుంది. ఆయన నాయకత్వంలోని సెలెక్షన్ కమిటీ నిర్ణయాలు భారత జట్టుకు అద్భుత విజయాలను అందించాయి. 2024, 2026 టీ20 వరల్డ్ కప్‌లతో పాటు 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా 2023 వన్డే వరల్డ్ కప్‌లో రన్నరప్‌గా నిలవడమే కాకుండా, రెండు ఆసియా కప్ టైటిళ్లు, ఏషియన్ గేమ్స్‌లో బ్యాక్-టు-బ్యాక్ స్వర్ణ పతకాలను భారత్ సాధించింది."చరిత్ర నిన్ను గొప్పగా గుర్తుంచుకుంటుంది"- గౌతమ్ గంభీర్
అగార్కర్ సేవలను కొనియాడుతూ బీసీసీఐ "కమిట్‌మెంట్, పట్టుదలతో జట్టును నడిపించిన అగార్కర్‌కు ధన్యవాదాలు" అని పేర్కొంది. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఎమోషనల్ పోస్ట్ చేశాడు. "అజిత్ భాయ్, మీతో కలసి పనిచేయడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. మనం కలిసి 3 ఐసీసీ ట్రోఫీలు సాధించాం. అవే 'ఎల్లప్పుడూ జట్టుకే తొలి ప్రాధాన్యత' అనే మీ సిద్ధాంతానికి నిదర్శనం. చరిత్ర మిమ్మల్ని ఎంతో గొప్పగా గుర్తుంచుకుంటుంది" అని గంభీర్ రాసుకొచ్చాడు.కొత్త చీఫ్ సెలెక్టర్ ఎంపిక ప్రక్రియ ప్రారంభం!
అగార్కర్ నిష్క్రమణతో ఖాళీ అయిన సెలెక్టర్ పదవి భర్తీకి బీసీసీఐ ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించింది. నిబంధనల ప్రకారం నూతన సెలెక్టర్ వెస్ట్ జోన్ నుంచి ఎంపికయ్యే అవకాశం ఉంది. ఒకవేళ కొత్తగా వచ్చే సెలెక్టర్ 24 కంటే తక్కువ టెస్టు మ్యాచ్‌లు ఆడి ఉంటే, ప్రస్తుతం ప్యానెల్‌లో ఉన్న ప్రజ్ఞాన్ ఓజా అధికారికంగా నూతన ఛైర్మన్‌గా బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం ప్రజ్ఞాన్ ఓజాతో పాటు ఆర్పీ సింగ్, అజయ్ రాత్రా, శివ సుందర్ దాస్ సెలెక్షన్ కమిటీలో కొనసాగుతున్నారు.
