సీనియర్ నటి పావల శ్యామల (75) ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' (మా) ఆధ్వర్యంలో ఇండస్ట్రీ పెద్దలు ఆమె అంత్యక్రియలను గౌరవప్రదంగా నిర్వహించారు.
అయితే, ఆమె మరణం తర్వాత ఆమె కుమార్తె కొన్ని యూట్యూబ్ ఛానెళ్ల వేదికగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. చిరంజీవి, దిల్ రాజు వంటి ప్రముఖులు సకాలంలో స్పందించి ఆర్థిక సహాయం చేయకపోవడం వల్లే తన తల్లికి ప్రైవేటు ఆసుపత్రిలో సరైన వైద్యం అందించలేకపోయామని, అందుకే ఆమె మరణించారని ఆమె ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను మెగాస్టార్ అభిమానులతో పాటు సినీ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఫిలిం జర్నలిస్ట్, డిస్ట్రిబ్యూటర్ మరియు నిర్మాత సురేష్ కొండేటి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఎమోషనల్ నోట్ విడుదల చేశారు.
* 'అరుంధతి' డ్రమ్ డ్యాన్స్ వెనుక అసలు కథ.. కోడి రామకృష్ణ కూడా కాపీ కొట్టారా?
సురేష్ కొండేటి వెల్లడించిన వాస్తవాలు:
పావల శ్యామలకు మెగాస్టార్ చిరంజీవి చేసిన సహాయాలకు తానూ ప్రత్యక్ష సాక్షినని సురేష్ కొండేటి స్పష్టం చేశారు. కేవలం వ్యూస్ కోసం కొన్ని ఛానెళ్లు, పరిపక్వత లేని ఆ కుమార్తె చేత అబద్ధాలు చెప్పించడం దారుణమని ఆయన మండిపడ్డారు.
పావల శ్యామల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రారంభంలోనే స్పందించిన చిరంజీవి, ఆమెకు రూ. 1,01,500 స్వయంగా చెల్లించి 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' (MAA) సభ్యత్వం ఇప్పించారు. ఆ కార్డ్ వల్లే ఆమెకు ప్రతి నెలా క్రమం తప్పకుండా పెన్షన్ అందుతోంది. వైద్య ఖర్చుల కోసం ఆమెకు ప్రత్యేకంగా కార్పొరేట్ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించారు. రెండు లక్షల రూపాయల తక్షణ సాయంతో పాటు ఎన్నోసార్లు వ్యక్తిగతంగా ఆర్థిక భరోసా ఇచ్చారు. కేవలం పావల శ్యామల విషయంలో మాత్రమే కాకుండా, గతంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడిన టీఎన్ఆర్, గుండు హనుమంతరావు, సుభాషిణి వంటి అనేకమంది సీనియర్ నటులను తన ద్వారానే చిరంజీవి ఆదుకున్నారని సురేష్ కొండేటి గుర్తుచేశారు.
* ఆగస్టు బాక్సాఫీస్ హంగామా.. .. ఈ నెలలో థియేటర్లలో సందడి చేయనున్న క్రేజీ చిత్రాలు
గతంలో తెలంగాణ ప్రభుత్వం, 'మా' అసోసియేషన్, చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, సాయి దుర్గ తేజ్, దిల్ రాజులతో పాటు ఎంతోమంది చిన్న, పెద్ద నటులు పావల శ్యామల కుటుంబానికి ఆర్థికంగా చేయూతనందించారు. అయితే, ఆమె మానసిక ఆందోళనల కారణంగా చుట్టుపక్కల వారితో, తమకు సహాయం చేసే వ్యక్తులతో దురుసుగా ప్రవర్తించడం వల్ల ఏ ఓల్డ్ ఏజ్ హోమ్‌లోనూ ఎక్కువ కాలం ఉండలేకపోయారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వివాదంపై ప్రముఖ దర్శకుడు వి.ఎన్. ఆదిత్య కూడా స్పందిస్తూ.. ఆ కుమార్తె భయాన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఇండస్ట్రీపై తప్పుడు ప్రచారం చేయడం శోచనీయమన్నారు. ఆఖరి క్షణాల్లోనూ 'మా' అసోసియేషన్ పూర్తి బాధ్యత తీసుకుని అంత్యక్రియలు జరిపించిందని, ప్రస్తుతం ఆమె కుమార్తె బాధ్యతలను కూడా చూసుకుంటోందని తెలిపారు. సాయం చేసిన వ్యక్తులపైనే నిందలు వేయడం సరికాదని, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా లక్షలాది మందికి ప్రాణదానం చేసిన మెగాస్టార్‌పై ఇటువంటి అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని సురేష్ కొండేటి కోరారు.

