ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి కాపు సంఘం నేత దాసరి రాము ఇటీవలి కాలంలో కీలక వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంటర్వ్యూల సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి, జనసేన పార్టీ గురించి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో దాసరి రాము చేస్తున్న వ్యాఖ్యలపై జనసేన తిరుపతి ఇంఛార్జి కిరణ్ రాయల్ స్పందించారు. దాసరి రాము వైసీపీకి అమ్ముడుపోయారని కిరణ్ రాయల్ ఆరోపించారు. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్‌ను కించపరిచేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఓడిపోయిన తర్వాత జనసేన నుంచి కొంతమంది వెళ్లిపోయారన్న కిరణ్ రాయల్.. వారిలో దాసరి రాము కూడా ఉన్నారన్నారు. దాసరి రాము రెడ్ల కనుసన్నల్లో పనిచేస్తూ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని అన్నారు.
నాదెండ్ల మనోహర్‌ను టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నారని.. నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. గుంటూరు సీటు కోసం వైసీపీకి దాసరి రాము అమ్ముడుపోయారని కిరణ్ రాయల్ ఆరోపించారు. పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తే నాలుక చీరేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.కాపు ముసుగులో పవన్ కళ్యాణ్‌ను విమర్సిస్తే బట్టలూడదీసి కొడతామంటూ కిరణ్ రాయల్ ఘాటు హెచ్చరిక చేశారు. మరోవైపు సుగాలి ప్రీతి కేసు విషయంలో న్యాయం చేసింంది పవన్ కళ్యాణ్ మాత్రమేనని కిరణ్ రాయల్ అన్నారు. సుగాలి ప్రీతి కోసం లక్షలాదిమందితో సభ పెట్టామని గుర్తు చేశారు.
తల్లి, చెల్లిని పట్టించుకోని వైఎస్ జగన్ సుగాలి ప్రీతి సమస్యను పరిష్కరిస్తారా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌ను విమర్శించేందుకు ఒక టీమ్ సిద్ధమైందన్న కిరణ్ రాయల్.. ఆయనను ఒక కులానికి పరిమితం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఇబ్బందులలో ఉన్నా పవన్ కళ్యాణ్ కోట్లు సహాయం చేశారన్నారు. 2019లో జనసేన ఓడిపోయిన తర్వాత కొంతమంది కాపు నేతలు వైఎస్ జగన్ కింద ఊడిగం చేసేందుకు వెళ్లారని.. వారే విమర్శిస్తున్నారని ఆరోపించారు. దెబ్బకు దెబ్బ తీస్తామని.. రివెంజ్ ఖాయమని కిరణ్ రాయల్ హెచ్చరించారు.

