2022లో 'మేజర్', 'హిట్ 2' సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన హీరో అడివి శేష్.. దాదాపు మూడున్నరేళ్ల తర్వాత 'డెకాయిట్' మూవీతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు.
షానియల్ డియో దర్శకత్వం వహించిన ఈ ద్విబాషా చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 10న తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాని విడుదల చేయనున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. ''నేను చాలా థ్యాంక్ ఫుల్ గా, గ్రేట్ ఫుల్ గా ఫీల్ అవుతున్నా. ఎట్మాస్లో ఫైనల్ గా 'డెకాయిట్' చూశాను. సినిమా తెగ నచ్చింది, ప్రాణం పెట్టి చేశాను. చాలా గ్రేట్ ఫుల్ గా అనిపించింది. మనం కోరుకున్న ఒక డ్రీమ్ ని నెరవేర్చాలని, ఎండా వాన ఏదీ పట్టించుకోకుండా, అన్నీ వదులుకొని ఇంతమంది అహర్నిశలు కష్టపడ్డారు. మా విజన్ ని నిలబెట్టాలని తపనపడ్డారు. మా డైరెక్టర్ షానీల్ గత ఆరు రాత్రులు పడుకోకుండా, వర్క్ చేస్తూనే ఉన్నాడు. ఇంకో గంటలో ఓవర్సీస్ కాపీ పంపించాలి. వాడు నా బెస్ట్ ఫ్రెండ్. ఈ సినిమా వాడి విజన్. ఇద్దరం కలిసి కన్న ఒక డ్రీమ్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి తను ఇక్కడ లేడు'' అని అన్నారు.
''నేను స్టేజ్ మీద ఎలా నిలబడ్డానో, ఈ సినిమా సుప్రియ గారి సపోర్ట్ మీద అలా నిలబడింది. ఇండస్ట్రీలోకి రాకముందు ఐదు సినిమాలు చేస్తే చాలు అనుకున్న నేను, ప్రేక్షకుల అభిమానంతో ఈరోజు ఇలా మీ ముందు ఉన్నాను. వెంకటేష్ గారికి, సిద్ధూకి, భోజ్ పురి సూపర్ స్టార్ పవన్ సింగ్ కి ధన్యవాదాలు. సింగర్ జోనితా గాంధీ ఒక సాంగ్ కోసం ఆరు రాత్రులు నాన్ స్టాప్ గా డ్యాన్స్ చేసింది. ఈ సినిమా కోసం అందరూ ప్రేమతో పని చేశారు. నా నుంచి సక్సెస్ లు చూశారు.. అంతకుముందు ఫెయిల్యూర్ లు కూడా చూశారు. కానీ ఈ 'డెకాయిట్'లో మేము సినిమాని ఎంత ప్రేమించామనేది చూస్తారు''
* సుప్రియకి మమ్మల్ని తిట్టే హక్కు లేదు.. ఆవిడని హింస పెట్టినందుకు అడివి శేష్‌కు థ్యాంక్స్: నిర్మాత నాగ వంశీ
''ఈ రెండున్నరేళ్ల జర్నీలో మాతో పాటు నడిచిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నేను బాగుండాలని, నేను నిలబడాలని, నన్ను లేపాలని నా శ్రేయస్సు కోసం కష్టపడ్డారు. రాహుల్ రవీంద్రన్ ఈ సినిమా చూసి 'నిలబెట్టావ్ రా' అన్నాడు. మృణాల్ ఠాకూర్ క్యారెక్టర్ ఇంటర్వెల్ లో పిచ్చెక్కించబోతోంది. ఇది నేను వైరల్ అవ్వాలని చెప్పడం లేదు.. నిజంగా నమ్ముతున్నాను కాబట్టి చెబుతున్నాను. ఇంటర్వెల్ లో తనే హైలెట్. ఇంటర్వెల్ అలా రావడానికి కారణం సుజీత్. 'డెకాయిట్' ట్రైలర్ ని 'గూఢచారి 2' డైరెక్టర్ వినయ్ కట్ చేసాడు. ఇలా మాకు చాలామంది కంట్రిబ్యూషన్ లభించింది. వారందరికీ థ్యాంక్స్''
''మేము ఒరిజినల్ గా ఒక ప్రేమ కథ అనుకున్నాం. కానీ ఈ రెండేళ్ల జర్నీలో అందరూ కూడా ఎంతో ప్రేమని అందించారు. ఏప్రిల్ 10న ఈ సినిమా రిలీజ్ అవబోతోంది. మీరందరూ ఒక హానెస్ట్ మూవీ, బ్యూటిఫుల్ ఫిలిం చూస్తారని నేను ప్రామిస్ చేస్తున్నాను. మా ప్యాషన్ ని చూస్తారు. 'డెకాయిట్' సినిమాని ఇద్దరు హీరోల మూవీగా మార్చిన మృణాల్ ఠాకూర్ కి థ్యాంక్యూ సో మచ్. నేను చాలా ఎమోషనల్ గా ఉన్నాను. ఇంకొంచం సేపు మాట్లాడితే.. 'డెకాయిట్' ఈవెంట్ లో ఏడుస్తున్న శేష్ అని థంబ్ నెయిల్స్ వచ్చేస్తాయి(నవ్వుతూ)'' అని అడివి శేష్ చెప్పుకొచ్చారు.

