Dailyhunt
ఢిల్లీలో ప్రధానిని కలిసిన మంత్రి లోకేష్.. కంగ్రాట్స్ చెప్పిన మోదీ

ఢిల్లీలో ప్రధానిని కలిసిన మంత్రి లోకేష్.. కంగ్రాట్స్ చెప్పిన మోదీ

Telugu Samayam 0 months ago

పీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. లోకేష్ కూటమి ఎంపీలతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందడంతో..

లోకేష్‌తో పాటు ఎంపీలు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి లోకేష్ ప్రధాని మోదీని శాలువాతో సత్కరించారు. మంత్రి లోకేష్‌కు ప్రధాని కూడా కంగ్రాట్స్‌ అంటూ అభినందించారు. ప్రధాని మోదీని కలవడం ఆనందంగా ఉందన్నారు మంత్రి లోకేష్. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందినందుకు కోట్లాదిమంది ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశానన్నారు.

అమరావతి కోసం భూములు త్యాగాలు చేసి.. రాజధాని కలను సజీవంగా ఉంచడం కోసం, ఎన్నో ఏళ్లుగా పోరాడిన రైతుల గురించి ప్రధానితో పంచుకున్నట్లు తెలిపారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మించేందుకు ప్రధాని నిరంతర మార్గదర్శకత్వాన్ని కోరానన్నారు లోకేష్. మంత్రి లోకేష్, కూటమి ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కూడా కలిశారు. లోక్‌సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు పెట్టి ఆమోదం పొందేందుకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే పలువురు కేంద్రమంత్రుల్ని మంత్రి లోకేష్ కలిసి ధన్యవాదాలు తెలిపారు.


అమరావతి చట్టబద్దత బిల్లుకు లోక్‌సభలో ఆమోదం తెలిపిన క్షణాలను మర్చిపోలేనన్నారు మంత్రి లోకేష్. పార్లమెంటులో ఈ బిల్లుపై జరిగిన చర్చను తాను టీవీలో చూశానని.. ఎంతో ఉత్కంఠ రేపిందన్నారు. 'అమరావతి చరిత్ర-సంస్కృతి, ఆవశ్యకత సభ్యులు వివరిస్తుంటే ఒక ఆంధ్రుడిగా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం, దేశంలోని వివిధ పార్టీలు మద్దతుగా నిలవడం ఐదుకోట్ల ఆంధ్ర ప్రజల ఆకాంక్షకు అద్దం పట్టింది. లోక్ సభ వేదికగా అమరావతి గొప్పతనం దేశమంతటికీ మరోసారి పరిచయమైంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రజాస్వామ్య దేవాలయం పార్లమెంటులో చరిత్ర సృష్టించిన అమరావతి చట్టబద్ధత బిల్లు చర్చలో పాల్గొనకుండా వైసీపీ సభ్యులు వాకౌట్ చేయడం వారి ద్రోహబుద్ధికి నిదర్శనం. జగన్ ఎన్ని జన్మలెత్తినా అమరావతిలో ఒక్క ఇటుకనూ తాకలేడు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధినీ ఆపలేడు. నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ శాశ్వతం, నా రాజధాని అమరావతి అజరామరం' అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.

'నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ - నా రాజధాని అమరావతి అని ఐదుకోట్ల ఆంధ్రులు గర్వంగా నినదించే చారిత్రాత్మకమైన రోజుకు దేశ పార్లమెంటు వేదిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతో రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానానికి చట్టబద్ధత కల్పించే అమరావతి బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టి, ఆమోదించడం కోట్లాది ప్రజలు గర్వించదగ్గ సందర్భం. కేంద్రప్రభుత్వానికి, మద్దతుగా నిలిచిన పార్టీలకు కృతజ్ఞతలు. ఇది ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అమరావతి విజయం.. ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం.. ఇది రైతుల త్యాగాలకు దక్కిన దైవ ఆశీస్సులు.. శాంతియుత పోరాటానికి దక్కిన ఫలితం.. కోట్లాది ప్రజల కోరికను గౌరవించిన కేంద్రం ఆంధ్రుల ఆత్మగౌరవ రాజధానిగా చరిత్ర-సంస్కృతికి ఆలవాలమైన అమరావతిని నిలిపింది. జై ఆంధ్రప్రదేశ్..జయహో అమరావతి' అంటూ మరో ట్వీట్ కూడా చేశారు. లోక్‌సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు ఆమోదం తెలిపిన సందర్భంగా ప్రధాని మోదీని కలిసేందుకు మంత్రి లోకేష్ బుధవారం రాత్రి బయల్దేరి ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ ప్రధాని సహా పలువురు కేంద్రమంత్రుల్ని కలిశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam