Dailyhunt
ఢిల్లీలో షాకింగ్ ఘటన: మాస్క్ ధరించి మరీ.. తండ్రి తలపై గన్‌పై పెట్టి రూ.10 లక్షలు దోచేసిన కొడుకు

ఢిల్లీలో షాకింగ్ ఘటన: మాస్క్ ధరించి మరీ.. తండ్రి తలపై గన్‌పై పెట్టి రూ.10 లక్షలు దోచేసిన కొడుకు

Telugu Samayam 1 week ago

Son Robber 10 Lakh Rupees to Father: సినిమా ఫక్కీలో జరిగిన ఒక సాయుధ దోపిడీ ఉదంతం చివరకు ఊహించని మలుపు తిరిగింది. తనను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో బెదిరించి రూ.

10 లక్షలు ఎత్తుకెళ్లారని ఒక వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తీరా దర్యాప్తులో తేలిన నిజం చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు. ఆ దొంగ మరెవరో కాదు.. సదరు వ్యాపారి కన్నకొడుకే. పాకెట్ మనీ తక్కువగా ఇస్తున్నాడని, ఎప్పుడు డబ్బులు అడిగినా లేవంటున్నాడనే కోపంతో అతడికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. అందుకో స్నేహితుడితో కలిసి ఈ దోపిడీ డ్రామాకు తెరతీశాడు. కానీ చివరకు పోలీసులకు చిక్కి ఊచలు లెక్కబెడుతున్నాడు.

అసలేం జరిగిందంటే..?

ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌కు చెందిన ఒక వ్యాపారి.. తన బావ మరిదికి రూ.10 లక్షలు ఇచ్చేందుకు బయలుదేరాడు. మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో బైకు మీద ఆయన ప్రయాణం కాగా.. లక్ష్మీ నగర్ వద్దకు చేరుకోగానే స్కూటీపై వచ్చిన ఇద్దరు ముసుగు దొంగలు ఆయనను అడ్డుకున్నారు. తుపాకీతో బెదిరించి, ఆయన వద్ద ఉన్న నగదు బ్యాగును లాక్కొని క్షణాల్లో మాయం అయ్యారు. బాధితుడు వెంటనే 112కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు ముందు ఆయన మాటలు నమ్మలేకపోయారు. డబ్బులు పోగొట్టుకుని ఇలాంటి కథ అల్లారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేశారు. నిజానిజాలు తేల్చేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి.. నిందితులు వెళ్లిన మార్గంలోని సీసీటీవీ కెమెరాలను జల్లెడ పట్టాయి.

అయితే బాధితుడు చెప్పినట్లుగానే ఇద్దరు మాస్కు వేసుకున్న ఇద్దరు దొంగలు.. స్కూటీపై వెళ్లడం కనిపించింది. దీంతో ఆయన మాటలు నమ్మిన వాళ్లు వారు ఏదారి గుండా వెళ్లారో తెలుసుకునేందుకు మొత్తంగా 120 సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. అయినా మాస్కులు ఉండడంతో.. వారి ముఖాలను గుర్తించలేకపోయారు. కానీ 121వ కెమెరా వద్ద నిందితులు చేసిన ఒక చిన్న పొరపాటుతో పోలీసులు వారిని పట్టుకున్నారు. ముఖ్యంగా ఆనంద్ విహార్ సమీపంలోని ఒక నిర్మానుష్య ప్రదేశంలో ..ఇక తమను ఎవరూ చూడటం లేదనుకున్న నిందితులు, కాసేపు గాలి పీల్చుకోవడానికి తమ ముసుగులను పక్కకు జరిపారు. ఆ సమయంలో అక్కడే ఉన్న కెమెరాలో ఒకరి ముఖం చాలా స్పష్టంగా రికార్డ్ అయ్యింది. ఆ దృశ్యాల ఆధారంగా బుధవారం నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.

ఇదీ చూడండి: సొంతింట్లో దొంగతనం చేసి పోలీసులకు ఫిర్యాదు.. ఎలా దొరికాడంటే..!

కన్నకొడుకే దొంగ అని తెలిసి..

నిందితుడిని పట్టుకున్న పోలీసులు.. బాధితుడైన వ్యాపారిని పిలిపించి గుర్తు పట్టమన్నారు. తనను తుపాకీతో బెదిరించిన వ్యక్తిని చూడగానే ఆ తండ్రి గుండె ఆగినంత పనైంది. ఎందుకంటే ఎదురుగా నిలబడింది తన సొంత కొడుకే. విచారణలో ఆ యువకుడు అసలు విషయం ఒప్పుకున్నాడు. తండ్రి తనకు అడిగినప్పుడు డబ్బులు ఇవ్వడం లేదని, సరైన పాకెట్ మనీ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని.. అందుకే ఆయనకు ఒక పాఠం నేర్పాలనే ఉద్దేశంతో ఈ ప్లాన్ వేసినట్లు తెలిపాడు.

ఇదీ చూడండి: బిజినెస్ చేసి డబ్బు సంపాదించాలనే కోరిక.. సొంతింట్లోనే మహిళ దొంగతనం.. చివరకు..

అమ్మమ్మ ఇంట్లో నగదు లభ్యం

దొంగిలించిన రూ. 10 లక్షల నగదును ఆ యువకుడు తన అమ్మమ్మ ఇంట్లో దాచిపెట్టినట్లు పోలీసులకు చెప్పగా.. వారు అక్కడికి వెళ్లి డబ్బును స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిందితుడికి సహకరించిన స్నేహితుడిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam