పాకిస్థాన్ గ్యాంగ్‌స్టర్, నిషేధిత పీపుల్స్ అమన్ కమిటీ మాజీ చీఫ్ ఉజైర్ బలోచ్ సోదరుడుపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. కరాచీలోని తన నివాసం వద్ద ఉజైర్ సోదరుడు జుబైల్ బలోచ్ గురువారం సాయంత్రం బయట ఉన్న సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు కాల్పులు జరిపి పారిపోయినట్టు పాక్ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఈ ఘటనలో జుబైర్ ఛాతి, పొత్తికడుపులోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అతడ్ని చికిత్స కోసం కరాచీలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాల్పుల ఘటనలో ఇద్దరు పాదచారులు కూడా గాయపడినట్లు సమాచారం.
కరాచీ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ముఖానికి మాస్క్‌లు ధరించి వచ్చిన దుండగులు జుబైర్‌పై కాల్పులకు పాల్పడ్డారు. అయితే ఓ దుకాణదారుడు వారిపై ఎదురు తిరగడంతో పరారయ్యారు. ఘటన సమయంలో జుబైర్ తన ఇంటి బయట ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారి సయ్యద్ అసద్ రజా తెలిపారు. గ్యాంగ్ వార్, నేర కార్యకలాపాల నేపథ్యంలో 2012లో అరెస్టైన జుబైర్ బలోచ్ గతేడాది జనవరిలో విడుదలయ్యాడు. జుబైర్‌పై కాల్పులకు పాత కక్షలు, గ్యాంగ్‌ల మధ్య ఆధిపత్య పోరు కారణం కావచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టామని అసద్ రజా పేర్కొన్నారు.
లియారీలో మళ్లీ గ్యాంగ్‌వార్..
కొన్ని నెలల కిందట జుబైర్ బలోచ్ ఓ రాజకీయ పార్టీలో చేరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ ఆ పార్టీ జెండాలను తన ప్రాంతంలో జుబైర్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో 'కరాచీ ఆపరేషన్' తర్వాత దుబాయ్, ఇరాన్‌కు పారిపోయిన గ్యాంగ్‌స్టర్లు కొందరు పశ్చిమాసియా యుద్ధంతో తిరిగి వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో లియారీలో మళ్లీ గ్యాంగ్ వార్ చెలరేగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కాగా, హత్యలు, పోలీసులపై కాల్పులు, అక్రమంగా పేలుడు పదార్థాల తయారీ, రవాణా తదితర కేసుల్లో ఉజైర్ బలోచ్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. 2012లో భద్రతా సిబ్బందిపై దాడి చేశారన్న ఆరోపణల కేసులో ఉజైర్‌ను కరాచీ పోలీసులు అరెస్ట్ చేశారు. గూఢచర్యం కేసులో ఏప్రిల్ 2020లో కోర్టు దోషిగా నిర్దారించి 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
దురంధర్‌తో వెలుగులోకి
దురంధర్ సినిమా విడుదలయ్యే వరకూ ఉజైర్ బలోచ్ పేరు మన దేశ ప్రజలకు పెద్దగా తెలియదు. ఉజైర్ బలోచ్ ఎవరనేది అందరికీ తెలిసిపోయింది. 'ధురంధర్'లో ఉజైర్ పాత్రను నటుడు డానిష్ పాండోర్ పోషించారు. రెహమాన్ దకాయత్ క్యారెక్టర్ తరువాత ఉజైర్ పాత్ర సినిమాలో హైలెట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
