Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దివ్యాంగుల సదరం స్లాట్ బుకింగ్ విధానంలో మార్పులు.. ఈ నెల 8 నుంచి ఛాన్స్, ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి

దివ్యాంగుల సదరం స్లాట్ బుకింగ్ విధానంలో మార్పులు.. ఈ నెల 8 నుంచి ఛాన్స్, ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి

Telugu Samayam 2 weeks ago

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో దివ్యాంగులకు తీపికబురు చెప్పింది. సదరం సర్టిఫికెట్ల కోసం దివ్యాంగులు ఇబ్బందిపడకుండా కీలక నిర్ణయం తీసుకుంది.

సదరం ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి స్లాట్‌ బుకింగ్‌లో మార్పులు చేయాలని నిర్ణయించారు. ఇకపై సదరం స్లాట్‌ బుక్ చేసుకునేందుకు రాష్ట్రాన్ని యూనిట్‌గా కాకుండా జోన్ల వారీగా వీలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. సదరం స్లాట్ బుకింగ్ విధానంలో తప్పులు జరగకుండా ఉండేందుకు సెల్ఫ్‌ డిక్లరేషన్‌ పద్ధతిని తీసుకొస్తామని ప్రకటించారు. ఈ సదరం స్లాట్‌లను ఈ నెల 8 నుంచి ఆగస్టు చివరి వరకు అమలు చేస్తామన్నారు మంత్రి. కొత్త విధానంలో స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. దివ్యాంగులకు సదరం స్లాట్ల విధానంలో మార్పులపై అవగాహన కల్పించాలని మంత్రి అధికారుల్ని ఆదేశించారు.

తాజా జోన్ల వివరాలు ఇలా ఉన్నాయి.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లిలు జోన్-1 కిందకు వస్తాయి. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలు జోన్-2 కిందకు వస్తాయి. పశ్చిమగోదావరి, ఏలూరు, పోలవరం, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలు జోన్-3 కిందకు వస్తాయి. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాలు జోన్-4 కిందకు వస్తాయి. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్‌ కడప జిల్లాలు జోన్-5.. నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీసత్యసాయి జిల్లాలు జోన్-6కు వస్తాయన్నారు మంత్రి. దివ్యాంగులు ఈ మార్పుల్ని గమనించాలని మంత్రి సూచించారు. జులై 13 నుంచి నిర్ధారణ పరీక్షలు చేస్తామన్నారు.

దివ్యాంగులు సొంత జోన్‌లోని జిల్లాల్లోనే స్లాట్ బుక్ చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. స్లాట్ బుకింగ్‌కు సెల్ఫి డిక్లరేషన్ తప్పనిసరి.. ఒకవేళ వైకల్య కేటగిరీపై స్పష్టత లేకపోతే డాక్టర్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలన్నారు. సదరం పోర్టల్‌లో ఆన్‌లైన్ ద్వారా హాజరు నమోదు తప్పనిసరిగా చేయాలన్నారు. ఏపీ సేవా పోర్టల్ ద్వారా నేరుగా సిటిజన్ లాగిన్‌తో ఉచితంగాఅపాయింట్‌మెంట్ చేసుకోవాలని సూచించారు. సదరం సర్టిఫికెట్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం ఉందన్నారు. సచివాలయాలు, మన మిత్ర వాట్సాప్ ద్వారా స్లాట్‌ల వివరాలు తెలుసుకోవచ్చన్నారు. సదరం సేవలన్నీ పూర్తిగా ఉచితమని.. దళారుల్ని నమ్మొద్దని, వారికి ఎలాంటి డబ్బులు ఇవ్వొద్దన్నారు.

దివ్యాంగులు స్లాట్లు బుక్‌ చేసుకుంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు పరీక్షించి సర్టిఫికెట్లు జారీ చేస్తారు. జోన్ పరిధిలో స్లాట్ బుక్ చేసుకున్న జిల్లాలో ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంటుంది. ఆధార్, రేషన్ కార్డు, పాస్‌ఫోటో, పుట్టు మచ్చల వివరాలు ఉండాలి. స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్ను కలిసి సెల్ఫ్ డిక్లరేషన్ అందజేయాలి. ఈ వివరాలు నమోదు చేసిన తర్వాత ఆధార్‌ లింక్ చేసిన మొబైల్‌కు ఓటీపీ వస్తుంది.. అది ఎంటర్ చేసి ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. దివ్యాంగులు ఈ మార్పుల్ని గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam