బీజేపీ నేత, మాల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పార్టీ మారబోతున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆయన తిరిగి సొంతగూటికి అంటే బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారంటూ కరీంనగర్‌లో పోస్టర్లు ప్రత్యక్షం కావటం కలకలం రేపింది.
దీనిపై తాజాగా ఈటల రాజేందర్ స్పందించారు. శామీర్‌పేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. పార్టీ మార్పు ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు.
తాను పార్టీ మారే పరిస్థితి లేదని.. పార్టీలు మారడం దుస్తులు మార్చినంత సులభం కాదని అన్నారు. ఎలాంటి తప్పు చేయకున్నా బీఆర్ఎస్ మెడలు పట్టి బయటకు గెంటేసిందన్నారు. అలాంటి పార్టీలోకి మళ్లీ వెళ్తున్నానని పిచ్చి ప్రచారాలు చేస్తున్న వారికి ఇదే తన సమాధానమన్నారు. ఈటల పార్టీ మారుతున్నారని కరీంనగర్‌లో కొందరు పోస్టర్లు వేయటం.. ఆరోపణలు చేయడం తనను బాధించిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలు మారే పరిస్థితి రాదని చెప్పారు.
కేసీఆర్ బీఆర్ఎస్ నుంచి పంపించి ఐదేళ్లు అవుతుంది. నాతో పాటు జీవన్ రెడ్డి, బొడిగె శోభా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారంటూ కొంతమంది పోస్టర్లు అంటిస్తున్నారు. పార్టీలు మారటం బట్టలు మార్చినంత ఈజీ కాదు. నా గురుంచి తెలంగాణ సమాజానికి తెలుసు. నేను ఇరవై ఏళ్ల పాటు బీఆర్ఎస్‌లో ఉన్నా.. దీంతో సహజంగానే ఆ పార్టీలోని నేతలతో నాకు పరిచయాలు ఉంటాయి. వారితో మాట్లాడితే పార్టీ మారటానికి రెడీ అయ్యానని రాయటం సరైంది కాదు. ఇలాంటి పిచ్చి పుకార్లు చేయుద్దు. నన్ను బర్తరఫ్ చేయడమే కాకుండా నన్ను ఇబ్బందులు గురిచేశారు. నా కోళ్ళ ఫార్మ్ లు కూల్చారు. భూములు గుంజు కున్నారు. లీగల్‌గా కొన్న భూముల్ని లాక్కున్నారు. అలాంటి పార్టీలోకి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదు.
ఈ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. కొంత మంది మీడియాను మేనేజ్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో జరిగే ఎన్నికల్లో సర్వేలు చేస్తున్నాం. అన్నీ తమకు పాజిటివ్‌గా ఉన్నాయి. అధికారం కోసం ఆధిపత్యం కోసం ఇతర పార్టీల నుండి నేతలు పక్క పార్టీలోకి వస్తారు. తనను గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ పార్టీలో రావాలని కోరారు. కోరుకున్న మంత్రిపదవి ఇస్తా అంటూ ఆఫర్ ఇచ్చారు. కానీ కమిట్మెంట్‌తో ఉద్యమంలోనే కొనసాగా. మనందరి అజెండా కేసీఆర్‌ను ఓడగొట్టాలని కాబట్టి రాజగోపాల్ రెడ్డి, తుమ్మల, జూపల్లి, వివేక్ లాంటి వాళ్లు కాంగ్రెస్ పార్టీలోకి పోదాం అన్నారు. ఒకవేళ నేను ఆ పార్టీలోకి పోయి ఉంటే మంత్రినో, డిప్యూటీ సీఎంనో అయ్యే వాడిని. నేను పదవుల కోసం పాకులాడను. అని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

