Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్.. ఈసారైనా జగన్ వెళతారా?

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్.. ఈసారైనా జగన్ వెళతారా?

Telugu Samayam 1 week ago

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నట్ల సమాచారం.

నాలుగు రోజుల నుంచి వారం పాటూ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందంటున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఐదు ఆర్డినెన్సులకు సంబంధించిన బిల్లుల్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ నెల 17న బీఏసీ (శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ) సమావేశంలో.. సభను ఎన్ని రోజులు నిర్వహించాలి? ఎజెండా అంశాలు ఏంటి అనే అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. నేటి కేబినెట్ సమావేంలో ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

కూటమి పాలనకు రెండేళ్లు పూర్తి కావడంతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను సభలో వివరించే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, ప్రాంతాలవారీగా అభివృద్ధి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి, అమరావతి, పరిశ్రమలు- పెట్టుబడులు, మెగా డీఎస్సీ-జాబ్‌ క్యాలెండర్, విద్యుత్‌ ఛార్జీల నియంత్రణ, సంక్షేమం వంటి ఎన్నో కీలక అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించాలని ప్రభుత్వం ప్రతిపాదించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మరి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకైనా మాజీ సీఎం జగన్ వెళతారా లేదా అన్నది చూడాలి.

ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అసెంబ్లీకి హాజరుకాని ఎమ్మెల్యేలపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు ప్రజల కోసం పోరాటం చేయాలని.. అలాంటి వారు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు రాష్ట్రం, నియోజకవర్గాల కోసం పని చేయకపోతే ఎలా అని.. అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యేలకు జీతభత్యాలు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. తాను ఈ అంశాన్ని స్పీకర్ల కాన్ఫరెన్స్‌లో కూడా ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రసంగాలు అద్భుతంగా ఉండేవిని.. మళ్లీ ఎప్పుడు సమావేశాలు నిర్వహిస్తారా? అని తాము ఎదురు చూసేవాళ్లమన్నారు.

అసలు ఇప్పుడు అసెంబ్లీలో అలా మాట్లాడేవారు లేరన్నారు అయ్యన్నపాత్రుడు. ఇప్పుడు అసెంబ్లీలో సమావేశాల్లో బూతులు తిట్టుకోవడమే సరిపోతుందని.. నేటి రాజకీయాల్లో పూర్తిగా విలువలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తెలుగును ప్రోత్సహిస్తానని.. అసెంబ్లీలో ఎమ్మెల్యే తెలుగులో మాట్లాడిస్తే మైక్ ఇస్తానని.. లేకపోతే మైక్ కట్ చేస్తానన్నారు. నేటి తరం నేతలు మండలి వెంకట కృష్ణారావు, వెంకయ్య నాయుడు, ఎన్టీఆర్ వంటి గొప్పవారిని ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యేలకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam