ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు శాంతిపై అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు అందింది.
దీంతో ఏసీబీ అధికారులు శాంతి ఇళ్లల్లో మంగళవారం సోదాలు నిర్వహించారు. తాడేపల్లి, ఉండవల్లితో పాటుగా నాలుగుచోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భారీగా అక్రమ ఆస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. విశాఖపట్నంలోని ఎండాడలో విలాసవంతమైన ఫ్లాట్, తాడేపల్లి కుంచనపల్లిలో జీ+2 భవనం ఉన్నట్లు గుర్తించారు.
అలాగే 770 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 కిలోల వెండిని సోదాల్లో ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. వీటితో పాటుగా శాంతి వద్ద రూ.1.15 లక్షల నగదు, బ్యాంకు అకౌంట్‍లో మరో రూ.3 లక్షలు ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు. ఓ కారు, బైక్ కలిగి ఉన్నట్లు సోదాల్లో తేలింది. ఈ క్రమంలోనే పది గంటలపాటు తనిఖీల అనంతరం, తాడేపల్లిలోని ఆమె నివాసం వద్ద ఏసీబీ అధికారులు శాంతిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఏసీబీ ప్రత్యేక కోర్టుకు తరలించారు. కోర్టులో విచారణ సందర్భంగా శాంతిని ఏసీబీ అధికారులు రిమాండ్‌కు కోరనున్నట్లు సమాచారం.
మరోవైపు పలు ఆరోపణలపై శాంతి మొన్నటి వరకూ సస్పెన్షన్‌లో ఉన్నారు. 2024 జులై నుంచి 2026 మార్చి నెల వరకు శాంతి సస్పెన్షన్‌లో కొనసాగారు. విశాఖలో కోట్ల విలువైన దేవాదాయ భూములను అక్రమంగా మళ్లించారంటూ శాంతిపై ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరించటం, హుండీ లెక్కింపులో అక్రమాలు వంటి అభియోగాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అవినీతి ఆరోపణలు, క్రమశిక్షణా రాహిత్యం వంటి కారణాలతో 2024 జూలైలో ప్రభుత్వం శాంతిని సస్పెండ్ చేసింది.
అయితే ప్రభుత్వ నిర్ణయంపై శాంతి హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఏడాది కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్ పొడిగించకూడదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే శాంతిపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేస్తూ, మళ్లీ పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శాంతిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అప్రాధాన్య పోస్టింగ్ ఇవ్వాలని ఏపీ దేవాదాయశాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి హరి జవహర్ లాల్ ఆదేశాలు జారీ చేశారు. ఈలోపే ఆమె ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు.

