ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.. 43మంది డాక్టర్లకు షాకిచ్చింది. ప్రభుత్వ వైద్య సేవలకు అనధికారికంగా దూరంగా ఉన్నవారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని నిర్ణయించింది.
వీరంతా వైద్యసేవలు అందించకుండా అనధికారికంగా విధులకు డుమ్మా కొడుతున్నారని తేలడంతో చర్యలు తీసుకుంంది. ఈ డాక్టర్లు దాదాపు నాలుగేళ్లుగా విధులకు హాజరుకాకపోవడంతో సంజాయిషీ కోరుతూ నోటీసులు జారీ చేశారు. వీరిపై అభియోగాలు కూడా నమోదు చేయగా.. వారి నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. ఈ క్రమంలో ఈ 43మందిని విధుల నుంచి శాశ్వతంగా తప్పించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
ఈ 43మంది డాక్టర్లపై ప్రభుత్వ నిబంధనలు అనుసరించి చర్యలు తీసుకున్నారు. ఏపీ సివిల్ సర్వీసెస్ (కాండక్ట్) రూల్స్-1964 ప్రకారం.. ఏడాదికిపైగా అనధికారికంగా విధులకు దూరంగా ఉంటే వారిని విధుల నుంచి తప్పించొచ్చని నిబంధనల్లో ఉంది. అందుకే ఈ నిబంధనల్ని అనుసరించి చర్యలు తీసుకుంటున్నారు. ఈ 43మందిన శాశ్వతంగా విధుల నుంచి తప్పించే ప్రక్రియ మొదలైందనే చెప్పాలి. ఈ 43మందితో పాటుగా మరో 34మంది డాక్టర్లపై అభియోగాలు నమోదు చేసి సంజాయిషీ నోటీసులు జారీ చేశారు. దీంతో వీరంతా రాజీనామా చేయగా.. వీరిలో 15 మంది రాజీనామాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు మెరుగైన సేవలు అందించాల్సిందేనని.. అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న వారి బాధ్యతారాహిత్యాన్ని ఎంతమాత్రం సహించబోమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గత నెలలో కూడా 51మంది డాక్టర్లను ఇలాగే శాశ్వతంగా తొలగించారు. వీరంతా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో పనిచేసేవారు. వీరిలో అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు ఉన్నారు. ఏపీ ప్రభుత్వం మరో ముగ్గురు ప్రొఫెసర్లపై త్వరలోనే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (డీఎస్‌హెచ్) పరిధిలో దాదాపు 118 మంది అనధికారికంగా విధులకు దూరంగా ఉన్నారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మొత్తం మీద డాక్టర్లకు ప్రభుత్వం షాకిచ్చింది.

