మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పిన తర్వాత సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ అయ్యారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌లో తాజా పరిణామాలు, రాజకీయ పరిస్థితులపై తన అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంటున్నారు.
కేంద్రం తీసుకున్న నిర్ణయాలు, ఇతర రాష్ట్రాలలో ప్రభుత్వాలకు సంబంధించి పాలసీలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అంశాలపై విజయసాయిరెడ్డి ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రభుత్వానికి సలహాలు కూడా ఇస్తున్నారు. తాజాగా ఏపీకి సంబంధించిన పెట్టుబడులు, పరిశ్రమలకు సంబంధించి స్పందించారు.. కొన్ని సలహాలు కూడా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేవలం పెట్టుబడుల ప్రకటనలతో ఆసక్తి ఉండదు.. అవి వాస్తవంగా కార్యరూపంలోకి వచ్చాయా లేదా అనేది ముఖ్యమన్నారు విజయసాయిరెడ్డి. అది జిందాల్ స్టీల్ ప్లాంట్ అయినా, గూగుల్ ఏఐ డేటా సెంటర్ అయినా.. ఈ ప్రాజెక్టులు సకాలంలో ప్రారంభమై, ఉద్యోగాలు, అభివృద్ధి, ఇచ్చిన హామీలు, ప్రయోజనాలను ప్రజలకు అందించడమే ముఖ్యం అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబులు పరిశ్రమలకు సంబంధించి సంతకం చేసిన అవగాహన ఒప్పందం (MoU)లు, దాని ప్రారంభ స్థితి, ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు కాలపరిమితి, వీటి ద్వారా వచ్చే ఉద్యోగాలు, పరిశ్రమలకు సంబంధించిన విస్తరణ ప్రణాళికలను ఎప్పటికప్పుడు నమోదు చేసేలా పెట్టుబటులకు సంబంధించి ఓ ట్రాకర్‌ను ప్రారంభించాలని సలహా ఇచ్చారు.. పారదర్శకతతో పాటుగా జవాబుదారీతనాన్ని, ప్రజల విశ్వాసాన్ని పెంపొందిస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అంతేకాదు విజయసాయిరెడ్డి అమరావతి వర్సెస్ మావిగన్ అంశంపైనా స్పందించారు. రాజధాని విషయంలో కూటమి పార్టీలు, వైఎస్సార్‌సీపీలు భిన్నమైన వాదనలు చేస్తున్నారని.. రాజధాని ఏర్పాటుపై శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన జరిగి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా రాజధాని అంశంపై చర్చ జరగడం సిగ్గుచేటన్నారు. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ తర్వాత రైతులకు ప్లాట్లు అప్పగించకపోవడంపై ప్రశ్నించారు. రాజధాని పేరుతో అవినీతి జరుగుతోందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ప్రజలు ముందు అవినీతిని ప్రశ్నించాలన్నారు. మావిగన్ వల్ల ప్రయోజనం ఏంటని.. అమరావతిలో వచ్చే మూడేళ్లలో నిర్మించే భవనాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అందుకే తాను అమరావతిలో జరిగే అవినీతిని కోర్టులో సవాల్ చేస్తానన్నారు.

