Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీలో మున్సిపల్ ఎన్నికలు.. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్..

ఏపీలో మున్సిపల్ ఎన్నికలు.. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్..

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలోని 100 పురపాలక సంఘాలలో త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది.

ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రభుత్వం ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు (బీసీలు) 33.33 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక పురపాలక శాఖ కమిషనర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన నివేదిక ప్రకారం, రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థలలో.. 100 చోట్ల త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తారు.

87 పురపాలక సంఘాల పదవీకాలం ఇప్పటికే పూర్తికాగా.. మరో 13 పురపాలక సంఘాల పదవీకాలం నవంబర్ నాటికి ముగియనుంది. కోర్టు కేసులు ఇతరత్రా న్యాయపరమైన ఇబ్బందుల కారణంగా 23 పురపాలక సంఘాలలో ఎన్నికలు సాధ్యపడేలా కనిపించడం లేదు. మిగతా వంద చోట్లా త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి బీసీలకు మున్సిపల్‌ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారు చేశారు. అలాగే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు, ఓటర్ల జాబితా తయారీ వంటి ప్రక్రియలను పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

మరోవైపు ఎన్నికల ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కసరత్తు వేగవంతం చేసింది. అందులో భాగంగా బుధవారం రోజున రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ కీలక వివరాలు వెల్లడించారు. స్థానిక ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించామని, ఒక్కో ప్రక్రియ పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలను సకాలంలో పూర్తిచేసి.. 16వ ఆర్థిక సంఘం నిధులు రాబట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam