Dailyhunt
ఏపీపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం.. ఈ జిల్లాల్లో వర్షాలు, వాతావరణశాఖ హెచ్చరిక

ఏపీపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం.. ఈ జిల్లాల్లో వర్షాలు, వాతావరణశాఖ హెచ్చరిక

Telugu Samayam 6 days ago

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు చల్లని కబురు చెప్పింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. 'తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా మన్నార్ వరకు ద్రోణి విస్తరించి ఉంది.

ఈ ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది' అని ఒక ప్రకటనలో తెలిపారు.

'బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం సాయంత్రం 5 గంటల సమయానికి శ్రీకాకుళం జిల్లా కోర్లాం 59.5 మిమీ, అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేటలో 55.2మిమీ, అనకాపల్లి జిల్లా రాజాంలో 47మిమీ, కె కోటపాడులో 21.2మిమీ చొప్పున అధిక వర్షపాతం నమోదైంది'అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మంగళవారం రోజు ఏపీలోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పిడుగులు, ఈదురుగాలులతో వానలు పడ్డాయి. శ్రీకాకుళం జిల్లా, అనకాపల్లి జిల్లా జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.

రాష్ట్రంలో వర్షాలు మాత్రమే కాదు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 40 డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. మార్కాపురం జిల్లా బోట్లగూడూరులో 43.4, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 43.2, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ, రేపు ఎండల తీవ్రత కొనసాగుతుందని చెబుతున్నారు. కొన్ని జిల్లాల్లో సాయంత్రం వరకు ఎండల తీవ్రత కొనసాగుతుండగా.. ఆ తర్వాత వాతావరణం మారిపోయి వర్షాలు పడుతున్నాయి. వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. ఈ అకాల వర్షాలతో రైతులు ఇబ్బందిపడుతున్నారు. రైతులు బయట ధాన్యాన్ని ఆరబెట్టగా.. మధ్యాహ్నం వరకు ఎండ ఉండి.. ఆ తర్వాత వాతావరణం మారిపోయి వర్షాలు పడుతుండటంతో ధాన్యం తడిచిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam