ప్రకాశం, మార్కాపురం జిల్లావాసుల చిరకాల కోరిక నెరవేరబోతోంది. రాష్ట్రంలో కీలకమైన కొత్త రైలు మార్గంలో రైలు పట్టాలెక్కబోతోంది.. దీని కోసం కీలక ముందగుడు పడింది.
ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ని కలిసి వినతిపత్రం అందజేశారు. నడికుడి నుంచి శ్రీకాళహస్తి మధ్య కొత్త రైలు మార్గంలో రైలు నడపాలని కోరారు.. ప్రకాశం జిల్లాలో కనిగిరి రైల్వే స్టేషన్ వరకు పనులు పూర్తయ్యాయని.. అక్కడి వరకు రైలు నడపాలని రిక్వెస్ట్ చేశారు. గుంటూరు నుంచి కనిగిరి వరకు Demu- Rake (డీసిల్ ఎలక్ట్రికల్ మల్టీపుల్ యూనిట్) ప్యాసింజర్ రైలును నడపాలని రైల్వే మంత్రిని కోరారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రైలు నడపడంపై సానుకూలంగా స్పందించారు.. గుంటూరు- కనిగిరి మధ్య రైలు త్వరలోనే నడిచే విధంగా ఏర్పాటు చేస్తామని తెలియజేసినట్లు ఎంపీ మాగుంట తెలిపారు. గుంటూరు నుంచి కనిగిరి వరకు త్వరలోనే రైలు పట్టాలెక్కుతుందని ఎంపీ చెబుతున్నారు.
మరోవైపు ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలోని కమిటీ హాల్‌లో గృహ, పట్టణ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో అటల్ మిషన్ ఫర్ రీజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫార్మేషన్ (AMRUT) పట్టణ తాగునీటి సరఫరాపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ (2025-26) యొక్క ఏడవ నివేదిక (18వ లోక్‌సభ)లోని సిఫార్సులపై ప్రభుత్వం తీసుకున్న చర్యలకు సంబంధించిన ముసాయిదా నివేదికపై చర్చించారు.
గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గ్రాంట్ల కోసం డిమాండ్లు (2026-2027) అంశంపై గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ (2025-26) యొక్క తొమ్మిదవ నివేదిక (18వ లోక్‌సభ)లోని సిఫార్సులపై ప్రభుత్వం తీసుకున్న చర్యలకు సంబంధించిన ముసాయిదా నివేదికపై చర్చించారు. గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని రాజధాని అభివృద్ధి విభాగం ప్రతినిధులతో కలిసి సమీక్షించారు. GPRA కాలనీల పునరాభివృద్ధి, ప్రభుత్వ నివాస గృహాల (క్వార్టర్ల) సంఖ్యను పెంచడానికి తీసుకునే చర్యలు వంటి పలు అంశాలపై చర్చించారు.

