Flight Ticket: విమాన ప్రయాణికులకు దిగ్గజ విమానయాన సంస్థ ఎయిరిండియా సడెన్ షాకిచ్చింది. గ్లోబల్ జెట్ ఫ్యూయెల్ ధరలు భారీగా పెరిగిన క్రమంలో దేశీయ, అంతర్జాతీయ విమానాల టికెట్లపై ఫ్యూయెల్ సర్‌ఛార్జీలు పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది.
సవరించిన కొత్త సర్‌ఛార్జీ రేట్లు దేశీయ విమానాలకు అయితే ఏప్రిల్ 8, 2026 నుంచే అమలులోకి వస్తాయని తెలిపింది. అదే ఇంటర్నేషనల్ మార్గాల్లో అయితే ఏప్రిల్ 10 నుంచి కొత్త రేట్లు అమలవుతాయని తెలిపింది. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో విమాన ఇంధన ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. దీంతో ఆ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రయాణింకులకు బదిలీ చేయాల్సి వస్తోందని తెలిపింది.
ఇంటర్నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ ప్రకారం.. మార్చి 27తో ముగిసిన వారంలో జెట్ ఫ్యూయెల్ బ్యారెల్ ధర సగటున 195.19 డాలర్లకు పెరిగింది. అంతకు ముందు ఫిబ్రవరి చివర్లో బ్యారెల్ జెట్ ఫ్యూయెల్ ధర 99.40 డాలర్ల వద్ద ఉంది. అంటే దాదాపు రెట్టింపు ధరకు చేరుకుంది. దీంతో పెరిగిన ధరల్లో కొంత భాగం ప్రయాణికులకు బదిలీ చేస్తున్నాయి విమానయాన సంస్థలు. ఇప్పటికే ఇండిగో ఫ్యూయెల్ సర్‌ఛార్జి పెంచగా తాజాగా ఎయిరిండియా సైతం అదే దారిలోకి వెళ్లింది. ఫ్యూయెల్ సర్‌ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. అయితే, సర్‌ఛార్జి పెంపు అనేది దూరాన్ని బట్టి మారుతుంది.
- 500 కిలోమీటర్ల వరకు ఒక్కో టికెట్ పై రూ. 299 ఫ్యూయెల్ సర్‌ఛార్జి వర్తిస్తుంది.
- 501- 1000 కిలోమీటర్లకు రూ. 399
- 1001- 1500 కిలోమీటర్లకు రూ. 549
- 1501- 2000 కిలోమీటర్లకు రూ. 749
- 2000 కిలోమీటర్లకు పైగా దూరం వెళ్లే విమానాలు అయితే రూ. 899 సర్‌ఛార్జి విధిస్తారు.
ఇంటర్నేషనల్ విమానాలకు
- SAARC దేశాలు (బంగ్లాదేశ్ మినహా) ఫ్యూయెల్ సర్‌ఛార్జి 24 డాలర్లు
- పశ్చిమాసియా దేశాలకు 50 డాలర్లు
- ఆగ్నేయాసియా (సింగపూర్ మినహా) 100 డాలర్లు
- సింగపూర్ 60 డాలర్లు
- ఆఫ్రికా దేశాలు 130 డాలర్లు
- ఐరోపా దేశాలు (యూకే మినహా) 205 డాలర్లు
- నార్త్ అమెరికా 280 డాలర్లు
- ఆస్ట్రేలియా 280 డాలర్లు

