Dailyhunt
ఫ్యూచర్‌ సిటీపై రేవంత్ సర్కార్‌కు ఊరట.. ప్రాజెక్టుపై స్టే ఇచ్చేందుకు ఎన్జీటీ నిరాకరణ

ఫ్యూచర్‌ సిటీపై రేవంత్ సర్కార్‌కు ఊరట.. ప్రాజెక్టుపై స్టే ఇచ్చేందుకు ఎన్జీటీ నిరాకరణ

Telugu Samayam 6 days ago

తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ తలపెట్టిన ఫ్యూచర్‌ సిటీకి సంబంధించి నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) చెన్నై ధర్మాసనం..

ఊరట కల్పించింది. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు నిర్మాణంపై దాఖలైన పిటిషన్‌పై స్టే ఇచ్చేందుకు ఎన్జీటీ చెన్నై బెంచ్ నిరాకరించింది. దీంతో రేవంత్ రెడ్డి సర్కార్‌కు రిలీఫ్ కలిగింది. ఎన్విరాన్‌మెంటల్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ నోటిఫికేషన్‌-2006లో వెల్లడించిన ప్రకారం.. పర్యావరణ అనుమతులు లేకుండానే ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని.. హైదరాబాద్ కొంపల్లికి చెందిన డాక్టర్ దొంతి నర్సింహా రెడ్డి.. ఎన్జీటీలో పిటిషన్ వేయగా.. తాజాగా విచారణ జరిపింది.

దాదాపు 30 వేల ఎకరాల్లో ఈ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును నిర్మించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని పిటిషనర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఈ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు నిర్మాణంపై స్టే విధించాలని పిటిషనర్ డాక్టర్‌ దొంతి నర్సింహారెడ్డి కోరారు. అదే సమయంలో పర్యావరణ అనుమతులు లేకుండా ఈ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు అభివృద్ధి పనులు చేపట్టడం చట్ట విరుద్ధమని పిటిషనర్ వాదించారు. ఇక ఈ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ తేరా రజినీకాంత్‌ రెడ్డి వాదనలు వినిపించారు.

ఈ సందర్భంగా ఫ్యూచర్‌ సిటీ ప్రాజెక్టుకు సంబంధించి.. ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణాలు గానీ, అభివృద్ధి కార్యక్రమాలు గానీ ప్రారంభించలేదని ప్రభుత్వం తరఫు లాయర్ వివరించారు. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉందని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో చట్టవిరుద్ధంగా.. నిబంధనలను అతిక్రమించి.. ఎలాంటి పనులు చేపట్టబోమని హామీ ఇచ్చారు. ఇక త్వరలోనే పర్యావరణంతోపాటు అన్ని రకాల అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు.

ఇరు వైపులా వాదనలు విన్న చెన్నై ఎన్జీటీ బెంచ్.. ఈ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు ఇంకా ప్రారంభం కానందున అనుమతులు తీసుకునేందుకు ఇంకా సమయం ఉందని పేర్కొంటూ.. దీనిపై స్టే ఇచ్చేందుకు నో చెప్పింది. ఇక పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణను జూన్‌ 9వ తేదీకి వాయిదా వేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam