ఒక మహిళకు బిడ్డను కనడమా లేదా ఉద్యోగం చేయడమా అనే స్థితిని కల్పించడం అంటే.. రాజ్యాంగం కల్పించిన మాతృత్వపు హక్కును, జీవనోపాధి పొందే హక్కును నేరుగా హరించడమేనని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
అసలీ కేసు ఏమిటంటే?
ఉత్తర ప్రదేశ్ సబ్‌ఆర్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ కమిషన్ (యూపీఎస్ఎస్ఎస్‌సీ) చేపట్టిన 2023 ఫారెస్ట్ గార్డ్, వైల్డ్‌లైఫ్ గార్డ్ నియామక ప్రక్రియలో కోమల్ జైస్వాల్ అనే అభ్యర్థి రాత పరీక్షలో ఉత్తీర్ణురాలయ్యారు. అయితే నియామకంలో భాగంగా ఆమె 14 కిలో మీటర్ల సుదీర్ఘ నడక శారీరక దారుఢ్య పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. 2026 ఫిబ్రవరిలో ఈ పరీక్ష సమయానికి ఆమె తొమ్మిది నెలల గర్భిణిగా ఉండటంతో.. కాన్పు అయ్యేంత వరకు పీఈటీని వాయిదా వేయాలని కోరుతూ కమిషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే నియామక నిబంధనల్లో వాయిదాకు ఎలాంటి అవకాశం లేదని పేర్కొంటూ కమిషన్ ఆమె విజ్ఞప్తిని తోసిపుచ్చింది. దీనిపై మొదట సింగిల్ జడ్జిని, ఆ తర్వాత చీఫ్ జస్టిస్ అరుణ్ భన్సాలీ, జస్టిస్ జస్ప్రీత్ సింగ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనాన్ని ఆమె ఆశ్రయించారు.మానవీయ కోణంలో చూడాలంటూ..!
ఈ అప్పీల్‌పై సమగ్ర విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం లఖ్‌నవూ కమిషన్ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టింది. నియామక నియమావళిలో వాయిదా వేయడానికి ప్రత్యేక నిబంధనలు లేకపోవచ్చు.. కానీ ఎక్కడా వాయిదా వేయకూడదని నిషేధించలేదని కోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి అసాధారణ పరిస్థితుల్లో అధికారులు మానవీయ కోణంతో, సానుభూతితో వ్యవహరించాల్సి ఉండిందని హితవు పలికింది. ఉద్యోగ ప్రకటన వెలువడినప్పటి నుంచి రాత పరీక్ష వరకు దాదాపు రెండేళ్లకు పైగా సమయం పట్టిందని.. ఈ మధ్యకాలంలో వివాహం, గర్భం దాల్చడం వంటివి సాధారణ జీవితంలో భాగమని స్పష్టం చేసింది. దీన్ని అభ్యర్థికి అనర్హతగా పరిగణించలేమని పేర్కొంది.నాలుగు వారాల్లో పరీక్ష జరపాలని ఆదేశం
బాధితురాలి పిటిషన్‌ను అనుమతించిన ద్విసభ్య ధర్మాసనం.. కోమల్ జైస్వాల్‌కు నాలుగు వారాల వ్యవధిలో విడిగా శారీరక దారుఢ్య పరీక్షను నిర్వహించాలని యూపీఎస్‌ఎస్‌సీని ఆదేశించింది. ఒకవేళ ఆమె పీఈటీ, మెడికల్ పరీక్షల్లో అర్హత సాధిస్తే.. ఆమెకంటే తక్కువ ర్యాంకు వచ్చిన అభ్యర్థికి ఉద్యోగం ఇచ్చిన తేదీ నాటి నుంచే అన్ని రకాల ప్రయోజనాలతో నియామకం చేపట్టాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఓబీసీ మహిళల కేటగిరీలో ఒక పోస్టును ఖాళీగా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.