Dailyhunt
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె నిశ్చితార్థం.. తరలివచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు

ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె నిశ్చితార్థం.. తరలివచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు

Telugu Samayam 2 weeks ago

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఇంట్లో ప్రస్తుతం పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమార్తె జనని బండ్ల వివాహం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్యతేజ చిలుకూరితో నిశ్చయమైంది.

ఈ క్రమంలో ఆదివారం ఉదయం(మే 3) వీరిద్దరి నిశ్చితార్థ వేడుక అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ నిశ్చితార్థ వేడుకకు సినీ, రాజకీయ రంగాల నుండి దిగ్గజాలు తరలివచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖ, పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెలతో కలిసి విచ్చేసి సందడి చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ వేడుకకు హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, ప్రముఖ రచయిత కోన వెంకట్, నటుడు శివాజీ, నిర్మాత సి. కల్యాణ్, దర్శకుడు శ్రీను వైట్ల తదితరులు పాల్గొని వేడుకలో ఆత్మీయతను నింపారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

* హాలీవుడ్ తెరపై 'అబూ'గా మెరవాల్సిన మెగాస్టార్ .. ఆ ప్రయోగం ఎందుకు ఆగిపోయింది?

అల్లుడి బ్యాగ్రౌండ్
బండ్ల గణేష్‌కి అల్లుడు కాబోతున్న సూర్యతేజ చిలుకూరి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవారు. సూర్యతేజ కుటుంబానికి రియల్ ఎస్టేట్ రంగంతో పాటు పలు వ్యాపారాల్లో బలమైన నేపథ్యం ఉందని సమాచారం. వీరికి కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అటు పౌల్ట్రీ వ్యాపారంలో సుస్థిర స్థానం ఉన్న బండ్ల గణేష్ కుటుంబానికి, ఇటు బలమైన వ్యాపార నేపథ్యం ఉన్న చిలుకూరి కుటుంబం తోడు కావడంతో ఈ వివాహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.


నటుడి నుండి స్టార్ ప్రొడ్యూసర్‌గా
మహబూబ్ నగర్ జిల్లాలో జన్మించి షాద్‌నగర్‌లో స్థిరపడిన బండ్ల గణేష్ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం.
పౌల్ట్రీ వ్యాపార నేపథ్యం నుండి వచ్చిన ఆయన మొదట నటుడిగా కెరీర్ ప్రారంభించి సహాయ నటుడిగా మెప్పించారు. నిర్మాతగా మారిన తర్వాతే ఆయన దశ తిరిగింది. 'పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్' బ్యానర్‌పై పవన్ కళ్యాణ్‌తో నిర్మించిన 'గబ్బర్ సింగ్' బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసింది. ఆ తర్వాత బాద్ షా, గోవిందుడు అందరివాడేలే, ఆంజనేయులు, ఇధ్దరమ్మాయిలతో, తీన్‌మార్, టెంపర్ వంటి చిత్రాలను నిర్మించి టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరిగా నిలిచారు.


* బండోడు ప్లేస్‌లో బక్కోడు... బాలయ్య-కొరటాల మూవీ బిగ్ అప్‌డేట్!


BG Blockbustersతో సెకండ్ ఇన్నింగ్స్
2015లో వచ్చిన 'టెంపర్' తర్వాత నిర్మాణ రంగానికి కాస్త దూరంగా ఉన్న బండ్ల గణేష్ ఇప్పుడు పదేళ్ల విరామం తర్వాత మళ్ళీ నిర్మాతగా రాణించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఆయన 'BG Blockbusters' (బండ్ల గణేష్ బ్లాక్‌బస్టర్స్) అనే కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ బ్యానర్ ద్వారా కమర్షియల్ చిత్రాలతో పాటు కంటెంట్ ఉన్న విలువైన సినిమాలను ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో ఉన్నారు. ప్రస్తుతం కుమార్తె జనని వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, అభిమానులు మరియు నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam