మలేరియా నివారణ మాత్రలు వికటించి గిరిజన బాలిక మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో క్లోరోక్విన్ వికటించి బాలిక మృతి చెందడంతో పాటు 57 మంది వరకు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలంటూ సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
గొల్లగుప్ప ఘటనపై వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు, పోలవరం జిల్లా కలెక్టర్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామంలో మొత్తం 71 మందికి క్లోరోక్విన్ మాత్రలు పంపిణీ చేసినట్లు అధికారులు వివరించారు. అస్వస్థతకు గురైన వారిలో 29 మందిని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సీఎంకు అధికారులు వివరించారు. మరో 24 మందికి లక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
కాకినాడ జీజీహెచ్ నుంచి ఇప్పటికే 9 మంది సభ్యుల వైద్య బృందాన్ని గొల్లగుప్పకు పంపామని కలెక్టర్ కె.దినేష్ కుమార్ సీఎం చంద్రబాబుకు తెలిపారు. మరో మూడు ప్రత్యేక బృందాలు విజయవాడ, రాజమండ్రి, కాకినాడ నుంచి బయల్దేరాయని వివరించారు. చికిత్స పొందుతున్న వారిలో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారన్న విషయాన్ని కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
ఈ ఘటనపై పోలవరం ఇన్‌ఛార్జ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమీక్ష నిర్వహించారు. ఆమె కూడా కలెక్టర్, ఉన్నతాధికారులతో మాట్లాడి సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. చిన్నారి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆమె, కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. చిన్నారి కుటుంబ వైద్య హిస్టరీని అధ్యయనం చేస్తున్నట్లు మంత్రికి కలెక్టర్ తెలిపారు. గొప్పగుప్ప గ్రామంలో వైద్య సేవలు నిరంతరం కొనసాగించాలంటూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. భద్రాచలంతో పాటు పోలవరం జిల్లాల్లో చికిత్స పొందుతున్న చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలంటూ అధికారులను ఆయన ఆదేశించారు.

