స్కాట్లాండ్‌లోని గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత బాక్సర్ల విజయ పరంపర కొనసాగుతోంది. శనివారం జరిగిన బాక్సింగ్ ఈవెంట్లలో ఇద్దరు బాక్సర్లు..
నిమిషాల వ్యవధిలో రెండు స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. మొత్తంగా సుమారు గంట వ్యవధిలో భారత బాక్సర్లు మూడు పతకాలు సాధించి క్రీడాభిమానులను మురిపించారు. మహిళల విభాగంలో ప్రీతి పవార్, జైస్మిన్‌లు పసిడి పతకాలతో మెరవగా, పురుషుల విభాగంలో జాదుమణి సింగ్ రజత పతకాన్ని ముద్దాడి భారత్ పతకాల పట్టికను మరింత ముందుకు తీసుకెళ్లారు.
మహిళల విభాగంలో 22 ఏళ్ల యువ బాక్సర్ ప్రీతి పవార్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫైనల్ పోరులో చురుకైన కదలికలు, శక్తివంతమైన పంచ్‌లతో ప్రత్యర్థిపై విరుచుకుపడి విజయాన్ని అందుకుంది. ఈ కామన్వెల్త్ గేమ్స్ 2026 బాక్సింగ్ విభాగంలో భారత్‌కు మొట్టమొదటి స్వర్ణ పతకాన్ని అందించిన బాక్సర్‌గా ప్రీతి పవార్ నిలిచింది. ఫైనల్‌లో కెనడాకు చెందిన స్కార్లెట్ సవన్నా డెల్గాడోను ప్రీతి 5-0 తేడాతో మట్టికరిపించింది. దీంతో ప్రీతి పవార్ ఫైనల్ మ్యాచ్‌ను వన్ సైడ్ చేసేసింది.
ప్రీతి ఇచ్చిన జోష్‌తో బరిలోకి దిగిన ప్రపంచ ఛాంపియన్, ఆర్మీ బాక్సర్ జైస్మిన్ లంబోరియా తన అనుభవాన్నంతా ఉపయోగించి రింగ్‌లో ప్రత్యర్థికి చుక్కలు చూపించింది. పంచ్‌ల వర్షం కురిపిస్తూ ఏకపక్షంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్‌లో నార్తర్న్ ఐర్లాండ్‌కు చెందిన మైఖేలా వాల్ష్‌పై జైస్మిన్ ఏకంగా 5-0 తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో నిమిషాల వ్యవధిలోనే భారత్ ఖాతాలో రెండు స్వర్ణాలు చేరాయి. జైస్మిన్ సాధించిన ఈ విజయంతో కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారతదేశం సాధించిన మొత్తం స్వర్ణ పతకాల సంఖ్య 7కు చేరుకుంది.
మరోవైపు పురుషుల ఫైనల్లో పోరాడిన భారత బాక్సర్ జాదుమణి సింగ్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో చివరి వరకు పోరాడినప్పటికీ, స్వల్ప తేడాతో విజయాన్ని చేజార్చుకొని రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. మొత్తంగా గంట వ్యవధిలోనే భారత్ రెండు స్వర్ణాలు, ఒక రజతం సాధించింది.

