Dailyhunt
గోదావరి జిల్లా ఎమ్మెల్యేకు అల్లుడైన రాయలసీమ టీడీపీ ఎమ్మెల్యే కుమారుడు.. పెళ్లి కుదిర్చింది కూడా టీడీపీ ఎమ్మెల్యే!

గోదావరి జిల్లా ఎమ్మెల్యేకు అల్లుడైన రాయలసీమ టీడీపీ ఎమ్మెల్యే కుమారుడు.. పెళ్లి కుదిర్చింది కూడా టీడీపీ ఎమ్మెల్యే!

Telugu Samayam 1 week ago

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని రాజకీయ కుటుంబాలు, ప్రజా ప్రతినిధుల మధ్య వియ్యంతో బంధుత్వాలు కలిశాయి. వీటిలో కొన్ని ప్రేమ వివాహాలు కాగా.. మరికొన్ని పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు.

అయితే తాజాగా మరో రెండు రాజకీయ కుటుంబాలు వియ్యం అందుకోబోతున్నాయి. రాయలసీమ అబ్బాయి గోదావరి జిల్లాకు అల్లుడు కాబోతున్నారు. నంద్యాల జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, వెంకటరెడ్డి దంపతుల కుమారుడు జనార్దన్ రెడ్డి.. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతుల కుమార్తె సనాతనిలకు వివాహం కుదిరింది. ఇవాళ హైదరాబాద్ జూబ్లీహిల్స్ JRC కన్వెన్షన్‌లో వివాహ వేడుక జరిగింది. ఈ వివాహ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే ఈ పెళ్లి సంబంధాన్ని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడినట్లు గౌరు వెంకటరెడ్డి తెలిపారు.

ఏపీలో వియ్యం అందుకున్న రాజకీయ కుటుంబాలు చాలానే ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలయ్య వియ్యంకులు. అలాగే మంత్రి నారాయణ, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావులు వియ్యంకులు. ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌లు కూడా వియ్యంకులు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ నేత సుబ్బారెడ్డి వియ్యంకులే. మాజీ మంత్రి బొత్స, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావులు వియ్యంకులే. ఇలా ఏపీతో పాటూ తెలంగాణలో కూడా కొందరు నేతలు వియ్యంకులయ్యారు. ఇప్పుడు గౌరు చరితారెడ్డి, వెంకటరెడ్డి.. నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మిలు వియ్యం అందుకోబోతున్నారు.

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె 2004లో నందికొట్కూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డిని ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009 అసెంబ్లీ ఎన్నికలకు నందికొట్కూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ కావడంతో పోటీకి దూరమయ్యారు. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీలో చేరి 2014 ఎన్నికల్లో పాణ్యం నుంచి పోటీచేసి విజయం సాధించారు. అయితే 2019లో రాజకీయ పరిణామాలు మారడంతో ఆమె వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో మళ్లీ టీడీపీ తరఫున పోటీచేసిన చరితారెడ్డి ఘన విజయం సాధించారు. చరితారెడ్డి భర్త వెంకటరెడ్డి కూడా కూడా రాజకీయాల్లో సీనియర్.

నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి కుటుంబం మొదటి నుంచి టీడీపీలో ఉంది. ఆయన తండ్రి మూలారెడ్డి నాలుగుసార్లు అనపర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.. 2004, 2009 ఎన్నికల్లో మూలారెడ్డి ఓడిపోయారు. అయితే మూలారెడ్డి వారసుడిగా రామకృష్ణారెడ్డి రాజకీయాల్లోకి వస్తారని భావించారు.. కానీ కుటుంబ పరిస్దితుల దృష్ట్యా ఆయన రాజకీయాలపట్ల ఆసక్తి లేదన్నారు. కానీ చంద్రబాబు పట్టుబట్టి మరీ రామకృష్ణారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా అనపర్తి నుంచి పోటీచేసిన రామకృష్ణారెడ్డి విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. మళ్లీ 2019 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోగా.. 2024 ఎన్నికలకు ముందు టికెట్ విషయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ అధిష్టానం పొత్తుల కారణంగా అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించింది.. దీంతో రామకృష్ణారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే చివరికి ఆయన బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున అనపర్తిలో పోటీచేసి విజయం సాధించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam